ఈ బడ్జెట్ లో నైనా సొంతింటి కల నెరవేరుతుందా ?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026లో గృహనిర్మాణ రంగానికి గణనీయమైన ప్రోత్సాహం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సరసమైన గృహాల ధర పరిమితిని ప్రస్తుత రూ.45 లక్షల నుంచి రూ.70– 90 లక్షలకు పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు ఆర్థిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రూ.45 లక్షల వరకు ఉన్న ఇళ్లు మాత్రమే సరసమైన గృహాల కేటగిరీలోకి వస్తున్నాయి. మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు, మెట్రోయేతర ప్రాంతాల్లో 90 చదరపు మీటర్ల పరిమితి కూడా ఉంది. అయితే భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, శ్రమ ఖర్చులు భారీగా పెరగడంతో ఈ పరిమితులు వాస్తవ పరిస్థితులకు సరిపోవడం లేదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లో రూ.70 లక్షల లోపు ధరకు రెండు బెడ్ రూమ్ ఫ్లాట్ దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే మధ్యతరగతి ప్రజలు పన్ను మినహాయింపులు, ప్రభుత్వ సబ్సిడీలకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో సరసమైన గృహాల ధర పరిమితిని పెంచాలని డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన అమలైతే మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించడమే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపును ఇవ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

