ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి వస్తా
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా హాజరవుతానని ప్రకటించారు. ఇప్పుడు తనకు స్వేచ్ఛ ఎక్కువగా ఉందని, ఒకప్పుడు పార్టీ ఆదేశాల మేరకే అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చేదని గుర్తుచేశారు. సభలో మాట్లాడే అవకాశం ఇస్తే పలు అంశాలను లేవనెత్తుతానని స్పష్టం చేశారు. బీజేపీలో తనలాగే చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, చేవెళ్ల ఎంపీ వ్యవహారం దానికి తాజా ఉదాహరణ అని తెలిపారు. పార్టీలో సమస్యలు ఉన్నా, పదవులు కోల్పోతామన్న భయంతో పలువురు నేతలు నోరు విప్పడం లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను కొందరు నేతలు సర్వనాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఒకవేళ వస్తే రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందులను వివరించిన తరువాతే మళ్లీ పార్టీలోకి వెళ్తానని, లేకుంటే చచ్చినా తిరిగి బీజేపీలో చేరనని రాజాసింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించబోయే అంశాలపై కూడా ఆయన స్పందించారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలనీ రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దమ్ముంటే సీబీఐ విచారణకు అప్పగించాలి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30 నుండి ప్రారంభం కానుండగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ప్రధానంగా చర్చించనున్నారు.