నిర్మల్‌లో బీజేపీ బోణికొడుతుందా!?
నిర్మల్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటి. నిర్మల్ నియోజకవర్గంలో హేమాహేమీలు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక్కడ్నుంచి మరోసారి విజయం సాధించి, బీఆర్ఎస్ పార్టీలో తనకు తిరుగులేదనిపించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భావిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇంద్రకరణ్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి మహేష్ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. అయితే ఈసారి ఆయన ప్రత్యర్థి మహేష్ రెడ్డితో బీజేపీ తరపున ఎదుర్కొంటున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ నుంచి శ్రీహరిరావు, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి కొట్లాడుతున్నారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, ఎత్తుపల్లాలను చూసిన ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 306 పోలింగ్ బూత్‌లు ఉండగా పురుష ఓటర్లు 1,17,563, స్త్రీ ఓటర్లు 1,29,914, ట్రాన్స్‌జెండర్లు 18, మొత్తం ఓటర్లు 2,47,495 ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసేది మున్నూరుకాపులే. ఇక్కడ 15 శాతం ఓటు బ్యాంక్ వారిదే. ఇక ఇతర బీసీలు సైతం 9 శాతం వరకు ఉన్నారు. ముస్లింలు ఎనిమిదిన్నర శాతం రెడ్లు 6 శాతం, మాల 6 శాతం, ఇతర ఎస్టీలు ఐదున్నర శాతం, మాదిగలు ఐదున్నర శాతం శాతం, పద్మశాలీ 5 శాతం, ఇతర ఎస్సీలు నాలుగున్నర శాతం, ఇతర ఓసీలు 4 శాతం ఉండగా, ఇతర కులాల వారు 30 శాతంగా ఉన్నారు.