ఆ కరెన్సీ నోట్లు ఎందుకు చినగవు..?
మన దేశంలో కరెన్సీ నోట్లు స్టయిలే వేరు. కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఓ డిజైన్‌తో ప్రింట్ చేసి ఇస్తే.. అది కాస్తా ప్రజల చేతిలో మారేసరికి దాని రూపురేఖలే మారిపోతాయి. కొన్ని నోట్ల మీద పేర్లు, కొన్నింటి మీద లెక్కలు, మరికొన్ని నలిగిపోయి, ఇంకొన్ని చిరిగిపోయి ఉంటాయి. వాటికి టేప్ అతికించి మరి వాడేసుకుంటారు. నోట్లు నీటిలో మాత్రం తడిస్తే అంతే సంగతులు. అయితే.. కొన్ని దేశాల్లో పకడ్బందీగా చిరిగిపోని కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నారు. ఆ దేశాలు ఏంటీ? వాటి ప్రత్యేకతలు ఏంటీ? మన దేశంలో ఆ కరెన్సీ నోట్లు ఎందుకు రాలేదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కరెన్సీ నోట్ల డిజైన్ల తయారీలో ఆస్ట్రేలియా దేశం మొదటి స్థానంలో ఉంది. సాధారణంగా చాలా దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీకి కాటన్‌ను వాడతారు. కానీ ఆస్ట్రేలియా 1988లోనే పాలిమర్ కరెన్సీలను ప్రవేశపెట్టింది. ప్లాస్టిక్ తరహాలో ఉండి మైనంతో చేసే ఈ కరెన్సీలు సాధారణ కరెన్సీ నోట్ల కంటే 2, 3 రెట్లు ఎక్కువ కాలం రాణిస్తాయి. ఈ కరెన్సీలు వాటర్ ఫ్రూఫ్ కావడం కాక వీటి నుంచి నకిలీ నోట్లు తయారు చేయడం దాదాపు అసాధ్యం కావడం విశేషం. కొన్నేళ్ళ కిందట ఆస్ట్రేలియా తీసుకొచ్చిన 500 డాలర్ నోటు కదుపుతూ ఉంటే ఆ పక్షి రెక్కలు ఆడిస్తున్నట్లు కనిపిస్తుందట. మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆస్ట్రేలియా నోట్లను చింపడం అసాధ్యం. అంతే ధృడంగా ఉండేటట్టు కరెన్సీ నోట్లను తయారు చేశారు.
ఇక ఆస్ట్రేలియా స్ఫూర్తితో చైనా, కెనడా అనేక దేశాలు కూడా ఈ పాలిమర్ కరెన్సీ నోట్లను తీసుకొచ్చాయి. కెనడా 2011 నుంచి ఆస్ట్రేలియా తరహాలో పూర్తిగా పాలిమర్ నోట్ల ఉత్పత్తిని ప్రారంభించింది. చైనా 2015లో తీసుకొచ్చిన 100 యువన్ నోట్లు ప్రత్యేకంగా నిలిచాయి. గోల్డ్ కలర్‌తో డిజైన్ చేసిన ఈ నోట్లను నకిలీగా ముద్రించడం దాదాపు కష్టం. విచిత్రమేమిటంటే ఈ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన కొత్తలో ఏటీఎం మెషీన్‌లే వీటిని గుర్తించలేకపోయాయట.

ఇక వియత్నం చేసే కరెన్సీలో వినూత్న టెక్నిక్‌ను వాడుతున్నారు. మైక్రో ప్రింటింగ్ పేర్కొనే ఈ ఫీచర్‌తో తయారు చేసే నోట్లపై రెండు సెక్యూరిటీ కోడ్‌లు ఉంటాయి. ఇది కాస్త హై సెక్యూరిటీ నోట్లతో గుర్తింపు పొందుతుంది. మన దేశంలో ఇలాంటి హై సెక్యూరిటీ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. గతంలోనూ భారత దేశం పాలిమర్ నోట్లను తయారు చేసేందుకు సన్నాహాలు చేసింది. 2009లో పాలిమర్ నోట్లను పెట్టడానికి తొలిసారిగా ఆర్బీఐ ఆసక్తి కనబరించింది. కొంత కాలంగా 10 రూపాయల పాలిమర్ నోట్లపై ట్రయల్ రన్ చేపట్టడానికి కేంద్రం సన్నాహాలు చేపట్టింది. పాలిమర్‌తో తయారైన 10 రూపాయలు చలామణి సక్సెస్ అయితే మిగిలిన కరెన్సీలను మార్చుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. యూపీఐ లావాదేవీలపై డిమాండ్ పెరగడం, పాలిమర్ నోట్లు భారత దేశంలో అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడంపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ ప్రపోజల్ మూలన పడిపోయింది.