Home Page SliderTelangana

ఏం చేశావని ఓటెయ్యాలి కేసీఆర్!? – ఈటల రాజేందర్ (మన సర్కార్‌కు ప్రత్యేకం)

కేసీఆర్ అసలు బీఆర్ఎస్‌కు ఓటేందుకు వేయాలి? ఏం చేశారు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? ఏం చేస్తున్నారు? సమైక్య పాలకులకు, తెలంగాణ పాలకులకు ఉన్న తేడా ఏంటి? 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలన ఇప్పుడు ఎన్నో ప్రశ్నలని లేవనెత్తుతోంది. కేసీఆర్ అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు పూర్తి యూటర్న్‌ల మయంగా మారింది. అది ఏ విషయమైనా సరే! నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఆ ఆశలు అడియాసలుగా మారాయి. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఏమయ్యాయో మనందరికీ తెలిసిందే! ఆ ప్రాజెక్టు వల్ల ఎన్నో నిధులు వృధా అయ్యాయి. ఎంత అవినీతి జరిగిందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ప్రాజెక్టును మార్చేసి కేసీఆర్ సాగించిన ధన యజ్ఞం నేటికీ కండ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇక నిధులు పెద్ద ఎత్తున తెలంగాణకు ఖర్చు చేసి ప్రజలను బాగు చేస్తామంటూ చెప్పిన కేసీఆర్ ఆ ఊసే మరచిపోయారు. బంగారు తెలంగాణ ఇంటికే పరిమితమైంది. నిధులన్నీ ఏవిధంగా ఖర్చవుతున్నాయన్న దానిపై ఎంతో గందరగోళం ఉంది. తెలంగాణ సంపన్న రాష్ట్రం అంటూ మాటలు చెప్పడానికి వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ ఫలాలు మాత్రం ప్రజలకు దక్కడం లేదు. కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఆయన ఆర్థిక వ్యవహారాలను గమనిస్తే మనకు అర్థం అవుతుంది. అరచేతిలో స్వర్గం చూపించడంలో కేసీఆర్‌ను మించిన వారు మరొకరు ఉండరు. పథకాల అమలు, పథకాల పంపిణీ ఈ రెండు అంశాలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఎన్నో విషయాలు అర్థం అవుతాయి.

ఇక నియామకాల విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం కలుగుతుంది. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ ఉద్యమ సమయంలో విద్యార్థుల్లో మరీ ముఖ్యంగా తెలంగాణ యువతలో కలిగించిన భావోద్వేగాలు ఎలాంటి సంఘర్షణకు కారణమయ్యాయో మనందరం చూసాం. ఉద్యమంలో ఎందరో విద్యార్థులు అశువులుబాశారు. తెలంగాణ కోసం తమను తాము బలి చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ… తెలంగాణలో విద్యార్థుల ఆకాంక్షల నెరవేరాయంటే లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ ఉద్యోగాల పేరుతో వంచనను మనందరం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ చెప్పాడంటే చేయడంతే అన్న భావన ఉద్యోగాల విషయంలో స్పష్టంగా కలుగుతుంది. అయితే ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం సఫలం అవుతున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం… గత ఆరు నెలలుగా నోటిఫికేషన్లు అంటూ పెద్ద ఎత్తున జాతర జరిపారు. అయితే ఆ నోటిఫికేషన్ల వెనుక ఉన్న వ్యూహం ఏంటో సామాన్యులకు ముఖ్యంగా యువతకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. టీఎస్పీఎస్సీ ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న లోపభూయిష్టత మనందరం చూశాం. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అన్నదానిపై ప్రభుత్వం శ్వేత పత్రం ఇవ్వాలన్న భావన వ్యక్తం అవుతుంది.

మొత్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గడిచిన 9 ఏళ్లలో సాగించిన పాలన అంతా పైన పటారం, లోన లొటారం అన్న భావన వ్యక్తం అవుతుంది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అనే కేసీఆర్ ఏ పథకాన్ని సరిగ్గా అమలు చేశారు? మొత్తం వ్యవహారంలో ఎంతో అస్పష్టత నెలకొంది. కేసీఆర్ ఎన్నికల్లో ప్రజలను బురిడీ కొట్టించడానికి మాత్రమే పథకాలు ఇస్తారని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబంధు పేరుతో ఒక సాహసం చేశారని అందరూ భావించారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం ఒక్కో ఎకరాకు 5వేలు ఇవ్వడాన్ని అందరూ హర్షించారు. అయితే ఇది పేద, మధ్యతరగతి అన్న భావన లేకుండా రైతలు అందరూ రైతులే అన్నట్టు ధనికులకు పథకం ఇవ్వడంతో అసలు ఇది ఏ స్ఫూర్తి అన్న భావన కలిగింది. కేసీఆర్ నిర్ణయం గొడ్డలిపెట్టుగా మారింది. పేద రైతులకు మాత్రమే పథకాలు ఇవ్వాలని, పేద వాళ్లకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలన్న స్ఫూర్తిని కేసీఆర్ నీళ్లు వదిలేశారు. బడుగులకు తన దొరతనాన్ని కళ్ళ ముందు చూపించారు.

ఇక హుజురాబాద్ లో నన్ను ఓడించేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. రాష్ట్రమంతట ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి పథకాన్ని అందించాలన్న భావన సైతం అభాసుపాలయ్యింది. కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందాయన్న విమర్శ సర్వత్రా ఉంది. దళిత బంధు తర్వాత గిరిజన బంధు, బీసీ బంధు, మైనార్టీలకు లక్ష ఇలా అనేక పథకాలను ఇస్తానని చెప్పి ప్రజలను ఏమార్చుతున్నాడు. బీసీలకు లక్ష రూపాయలు నగదు బదిలీ అంటూ ఉసురుమనిపించాడు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు… బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు దాదాపు 90% పైగా ఉన్నారన్న భావన ఉంది. మరి ఆ వర్గాలకు మేలు చేయడం ఇలాగేనా? కేవలం పథకాల పేర్లు చెప్పడం జనంలో ఆశలు రేకెత్తించడం ద్వారా ఓట్లు పొందాలను కోవడమే ఏకైక సిద్ధాంతంగా ఉంది. ఉదాహరణకు తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో అకాల వర్షాలతో లక్షల కోట్ల పంటలు రైతులు నష్టపోయారు. రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చిందా అంటే అది చాలా స్వల్పమని చెప్పాల్సి ఉంటుంది. రైతు బీమా పథకం లేకపోవడం, ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడంతో రైతుల నోట్లో మట్టి కొట్టినట్లు అయింది. అకాల వర్షాలతో ఎప్పటికప్పుడు రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఇలా కేసీఆర్ రైతుల నడ్డి విరిచాడు.

మరీ ముఖ్యంగా చెప్పాలంటే యువతను నట్టేట ముంచారు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను మభ్యపెట్టాడు. ఎన్నికలు వచ్చే సమయంలో నోటిఫికేషన్లు ఇచ్చి వారిని ఆగం చేస్తున్నాడు. కేసీఆర్ స్టైల్ ఫంక్షనింగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో చివరాకరకు ఎలా ఉంటుందోనన్న అనుమానాలు కూడా యువతలో పెద్ద ఎత్తున ఉన్నాయి. కేవలం రాజకీయం ద్వారా లబ్ధి పొందాలన్న ఏకైక ఆలోచన తప్పించి కేసీఆర్ పాలనలో ఎలాంటి సంక్షేమం జరగలేదన్నది నిర్వివాదాంశం. వచ్చే ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ బలపడుతోండటంతో కేసీఆర్‌కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఓవైపు కిషన్ రెడ్డి, మరోవైపు ఈటల రాజేందర్ నాయకత్వంలో బీజేపీ సర్వశక్తులు వడ్డీ కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే తెలంగాణ వ్యూహాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం తమదే అన్న భావనలో ఉంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు విభేదాలను పక్కనపెట్టి ఎన్నికల్లో కొట్లాడాలని భావిస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు ముందు నెయ్యి వెనుక గొయ్యి అన్న భావన వ్యక్తం కలుగుతుంది.

ఈటల రాజేందర్, చైర్మన్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, తెలంగాణ బీజేపీ

మన సర్కార్‌కు ప్రత్యేకం