దావోస్ దాకా దేనికి…జూబిలీహిల్స్‌లో చేసుకోవచ్చుగా?
జూబిలీహిల్స్‌లో నివాసం ఉండే సీఎం రేవంత్ రెడ్డి,మేఘా కృష్ణారావులు ఎం.వో.యూలు చేసుకోవడానికి దావోస్ దాకా వెళ్ళాలా? వాకింగ్ చేసుకుంటూ ఎవరు ఎవరింటికి వెళ్లినా ఒప్పందాలు చేసుకోవచ్చుగా అంటూ మాజీ మంత్రి,తాజా ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఇప్పటికే కిషన్ రెడ్డి ఈ విషయంపై ఘాటుగా స్పందించగా…ఇప్పుడు హరీష్ రావూ అదే బాటలో విమర్శిస్తున్నారు. జూబిలీహిల్స్‌లో ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు కూడా దావోస్ వెళ్లారని,చార్జీలు దండగ తప్ప మరొకటుందా అని వెటకరించారు.సీఎం రేవంత్ రెడ్డి గత పర్యటన సందర్భంగా రూ.40వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చంకలు గుద్దుకున్నారని,కానీ అందులో ఒక్క ప్రాజెక్టుకు కూడా భూమి పూజ చేయించలేకపోయారని విమర్శించారు.సింగల్ విండో పాలసీని కాస్త కమీషన్ల విండో పాలసీగా మార్చారని ఎద్దేవా చేశారు.అబద్దపు ప్రచారంతో ప్రజల్ని ఎంతో కాలం మభ్యపెట్టలేరంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు.