NationalNewsSpiritual

ఈరోజును ‘కోటి సోమవారం’ అని ఎందుకంటారు?

ఈ కార్తీకమాసం హిందువులందరికీ పరమ పవిత్రమైన మాసం. ఈ నెలలో వచ్చే శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న ఈ రోజును(నవంబర్ 9) ‘కోటి సోమవారం’ అని వాడుకలో పిలుస్తారు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం. అందుకే ఈ రోజును హరిహరులిద్దరికీ సమానమే అనే భావనతో ‘కోటి సమవారం’ అంటారు. ఎందుకంటే కార్తీక మాసం శివకేశవులకు ఇద్దరికీ ప్రీతపాత్రమైనది. హరి స్థితి కారకుడైతే, హరుడు శుభములు కలిగించెడివాడు. ఈ రోజున వీరిద్దరి ఆరాధన ఎంతో శుభప్రదం. నేడు మనం చేసే ప్రతీ పని శుభములు కలిగించేదిగా ఉండాలని ప్రతీతి. నేడు అన్నింటికన్నా శుభములు కలిగించే పని ‘దీపారాధన’. ఈ రోజున చేసే  ‘దీపారాధన’, ‘దానం’, ‘అభిషేకం’, ‘ఉపవాసం’ ఏదైనా సరే విశేష ఫలితాలను ఇస్తుంది. కోటి రెట్లు ఫలితాలను ఇస్తుందనే ఉద్దేశంతో ‘కోటి సోమవారం’ అనే పేరు నిలిచిపోయింది. ఈ కార్తీక మాసంలో ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే, అంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని నమ్ముతారు. ఈ నెలలో చేసే దానాలు కూడా ఎంతో శుభఫలితాలను ఇస్తాయి. దానం చేస్తూ ‘కార్తీక దామోదర ప్రీతయే’ అంటూ మంత్రం పఠించాలి. ఈ రోజున దానాలు చేసిన వారికి తెలిసి, తెలియక చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయి. కోటి శివ లింగాలను పూజించిన ఫలితం కలుగుతుంది.