నాగార్జున.. ఎందుకు ఇంత కక్కుర్తి
సినిమాలలో నటిస్తే కోట్ల రూపాయలు వస్తాయని, భూముల కబ్జా కక్కుర్తి నాగార్జునకు ఎందుకు వచ్చిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో నాగార్జున అధినేతగా ఉన్న ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చిన ప్రదేశాలను సిపిఐ నారాయణ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న భూమిలో ఫంక్షన్ హాల్ కట్టి కోట్లాది రూపాయలు సంపాదించాడని.. ఆ డబ్బు రికవరీ చేసి పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూములను ఆక్రమించడం నాగార్జునకు తగదన్నారు. హైడ్రాతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎంఐఎం ఆక్రమించినన్ని భూములు ఇంకెవరూ ఆక్రమించలేదని ఆరోపించారు. ఆ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ వారైనా అక్రమ నిర్మాణం చేపట్టినా హైడ్రా కూల్చివేతలు చేపట్టాలన్నారు.