చీమలు ఒకే వరుసలో ఎందుకు తిరుగుతాయి..? మీకు తెలుసా..?
చీమ ఒక చిన్న కీటకము. ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలుగుతుంది. ఇవి భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కడుతుంటాయి. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు. వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి.

ప్రపంచంలోని పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, దేవుడు అన్ని జీవులకు ముఖ్యమైన బాధ్యతలను ఇచ్చాడు. చీమలు ఎప్పుడూ ఒక వరుసలో నడుస్తాయనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు అలా ఒకే వరుసలో నడుస్తాయి. అసలు కారణం ఏమిటంటే.. చీమలు పుట్ట రూపంలో ఒక ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అందులో జీవిస్తాయి. ఇందులో రాణి చీమ, మగ చీమ, అనేక ఆడ చీమలు ఉంటాయి. మగ చీమలకు రెక్కలు ఉండగా, ఆడ చీమలకు మాత్రం ఉండవు. ఈ చీమలు ఆహారం వెతుక్కుంటూ బయటకు వెళ్ళినప్పుడు, రాణి చీమ దారిలో ఫెర్మోన్స్ అనే రసాయన్ని వదులుతుంది. ఇతర చీమలు ఆ రసాయనం వాసన ఆధారంగా అదే బాటలో వెళ్తాయి. చీమలు ఒక వరుసలో నడవడానికి ఇదే కారణం. అంటార్కిటికా మినహా ప్రపంచంలోని ప్రతి మూలలో చీమలు కనిపిస్తాయి. ఎక్కువ కాలం జీవించే కీటకాలలో చీమలు కూడా వస్తాయి. ప్రపంచంలో కొన్ని కీటకాలు కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాయి. అందుకు విరుద్దంగా, ఒక నిర్దిష్ట జాతి ‘పోగోనోమైమెక్స్ అహి’ అని పిలువబడే రాణి చీమ 30 సంవత్సరాలు జీవిస్తుంది.

ఎర్ర చీమలు మనుషులను ఎందుకు కొరుకుతాయి..
మనం తరచూ ఎరుపు, నలుపు చీమలు కనిపిస్తుంటాయి. నిజానికి ఎర్ర చీమలు మనుషులను కొరుకుతాయి. కానీ నల్ల చీమలు మనపై ఎలాంటి దాడి చేయవు. దీనికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ప్రపంచంలో సుమారు 12 వేల నుంచి 15 వేలకు పైగా రకాల చీమ జాతులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చీమలు శరీరంలో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది. వాటిని తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగిస్తాయి. చీమలు మిమ్మల్ని కాటు వేస్తాయి కాబట్టి అవి ఈ ఫార్మిక్ ఆమ్లాలను విడుదల చేస్తాయి. చీమ తన శరీరంపై ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేసినప్పుడు, దురద, నొప్పి, బొబ్బలు కూడా వస్తాయి. కాబట్టి చీమ కాటు వేసిన తర్వాత చిరాకు కలిగిస్తుంది. నిజానికి నల్ల చీమలు కూడా కరుస్తాయి. కానీ వీటిలో ఫార్మిక్ యాసిడ్ తక్కువగా ఉంటుంది. అవి మీకు తెలియని చిన్న మొత్తంలో ఆమ్లాన్ని మీ శరీరంపై విడుదల చేస్తాయి. అందుకే అవి మీపై దాడి చేసినా నొప్పి బాధ అనిపించదు.