పసుపు కుంకుమ ఇచ్చినా చంద్రబాబుకు జనం ఓటేయలా?
2024లో తిరిగి మంగళగిరిలో వైసిపి జెండాను ఎగరవేస్తాం
జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా– ఎమ్మెల్యే ఆర్కే
2019లో పసుపు కుంకుమ ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏపీలో ప్రజల నమ్మకాన్ని ఎందుకు పొందలేకపోయారని నారా లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓటమిపాలయ్యారని ప్రశ్నించారు మంగళిగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). నగరంలోని పెద్ద కోనేరు అభివృద్ధి పనులను ఆయన మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా 2024 లో దానికి కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా ఉండి లోకేష్ పని చేయలేదనే ప్రజలు మంగళగిరిలో ఓడించారని అన్నారు. 2024 ఎన్నికల్లోను మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురేస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్కే కు టికెట్ కేటాయించడం లేదు. అందువల్లనే ఆయన పార్టీ కార్యక్రమాలకు మా నమ్మకం నువ్వే జగన్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఈ కామెంట్స్ చేశారు. జగనన్నను, ఆర్కేను ప్రజలు నమ్మారు కాబట్టే అండగా నిలిచారని తెలిపారు. మంగళగిరిలో 2014-19 కి ముందు 2019 తర్వాత మధ్య జరిగిన అభివృద్ధి లో వ్యత్యాసం అందరికీ తెలుసునని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు పెద్ద కోనేరు అభివృద్ధి పనులను పూర్తి చేసి తీరుతామని అన్నారు.
