NewsTelangana

ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకు..?

మునుగోడులో కాంగ్రెస్‌ పరిస్థితిని తేల్చిన కోమటిరెడ్డి

ఆస్ట్రేలియాలో తన అభిమానులకు చెప్పిన వెంకట్‌రెడ్డి

మునుగోడులో ఎన్నికలకు రెండు వారాల ముందే కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీడియా ముందు కంటతడి పెట్టారు. శుక్రవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తకు ఫోన్‌ చేసి పార్టీలకు అతీతంగా తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డికి ఓటేయాలని కోరిన ఆడియో లీక్‌ అయింది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ మునుగోడులో గెలిచే అవకాశమే లేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

కాంగ్రెస్‌కు 10 వేల ఓట్లే వస్తాయి..

ఆస్ట్రేలియాకు విశ్రాంతి కోసం వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడి విమానాశ్రయంలో తన అభిమానులతో మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోంది. మునుగోడులో కాంగ్రెస్‌ తరఫున తాను ప్రచారం చేసినా లాభం లేదని.. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచే అవకాశమే లేదని ఆ వీడియోలో స్పష్టం చేశారు. ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటంలో కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోరని చెప్పారు. కాంగ్రెస్‌కు అక్కడ 10 వేల ఓట్లే వస్తాయని.. తాను ప్రచారం చేస్తే కొన్ని ఓట్లు పెరుగుతాయని తెలిపారు.

నా ప్రచార ఖర్చు ఎవరు భరిస్తారు..

తాను ప్రచారానికి వెళ్తే ఖర్చులు ఎవరు భరిస్తారని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న వెంకట్‌రెడ్డి ఇలా అనడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాను పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఇక చాలని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి మధ్య టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోరాటం నడుస్తోంది. సీనియర్‌ నాయకుడైన తనను కాదని రేవంత్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిని చేయడంపై వెంకట్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ నాయకుల అధికార దాహానికి పాల్వాయి స్రవంతిని బలిపశువును చేశారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.