నర్సాపూర్‌లో చివరి వరకు సస్పెన్స్ తప్పదా?
గతంలో సీపీఐ కంచుకోటగా ఉన్న ఇక్కడ్నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధిస్తూ నియోజకవర్గంపై చెరగని ముద్ర వేసింది. 1999 నుంచి సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ నుంచి మూడు సార్లు విజయం సాధించారు. కీలక శాఖలకు మంత్రిగానూ పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆమె 2014లో తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లోనూ ఓడిపోయారు. మారిన పరిస్థితుల్లో ఆమె గులాబీ కండువ కప్పుకోవడం మహిళా కమిషన్ చైర్మన్ గానూ నియమితులయ్యారు. ఐతే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని బీఆర్ఎస్ పార్టీ సునీతా లక్ష్మారెడ్డికి ఇక్కడ టికెట్ కేటాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డికి అవకాశం ఇచ్చింది. నర్సాపూర్ లో తిరిగి గెలవాలన్న సునీత లక్ష్యం నెరవేరుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తిరిగి పుంజుకుంటుందో చూడాలి. ఇక నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మురళీ యాదవ్ బరిలో నిలుస్తున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పుడు నర్సాపూర్ సైతం హాట్ సీట్ గా మారుతోంది.

నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 305. పురుష ఓటర్లు 1,07,587 మంది కాగా, మహిళా ఓటర్లు 1,12,617 మంది ఉన్నారు. ఏడుగురు ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,20,211 ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలో పదిహేడున్నర శాతం ఆ వర్గం ఓటర్లున్నారు. ఇక ముస్లింలు 10 శాతానికి పైగానే ఉన్నారు. మాదిగలు 11 శాతం మేర ఉండగా, మాలలు 9 శాతానికి చేరువగా ఉన్నారు. గౌడలు, లంబాడాలు ఏడున్నర శాతం, గొల్లలు ఆరున్నర శాతం మేర ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం 5 శాతానికి పైగా ఉండగా, పద్మశాలీలు 4 శాతం ఉన్నారు. మున్నూరుకాపులు రెండు శాతానికి చేరువగా ఉన్నారు. ఇక అన్ని వర్గాల ఓటర్లు 18 శాతానికి పైగా ఉన్నారు.

