ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు?
◆ ఏ ఇద్దరు కలిసిన పార్టీల పొత్తుల పైన చర్చ
◆ టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతాయని జోరుగా ప్రచారం
◆ చాలా చోట్ల విజయావకాశాలను ప్రభావితం చేయనున్న పవన్ కళ్యాణ్
◆ వైసీపీలో గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేలపై వేటు
◆ ఆయా నియోజకవర్గాలకు అదనపు ఇన్‌చార్జీల నియామకం
◆ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఇబ్బందేనంటున్న విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించిన వైసీపీ ఈసారి జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే పరాజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలవడంతో ఏపీలో ఏ ఇద్దరు కలిసిన రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈసారి ఎన్నికల నాటికి పొత్తులు ఎలా ఉంటాయన్నదానిపైనే ప్రధానంగా చర్చ జరుపుతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ సర్కారుపై ప్రజల్లో ఇప్పటికిప్పుడు వచ్చిన వ్యతిరేకత లేదన్న వర్షన్ ను సైతం సర్వేలు ఇస్తున్నాయ్. ఇటీవల వచ్చిన మూడు సర్వేల్లోనూ జగన్ సర్కారుకు సానుకూలత కన్పించింది. ఐతే ఎమ్మెల్యే ల గ్రాఫ్ మాత్రం భారీగా క్షీణించిందని దానిని మెరుగుపరుచకోకుంటే వచ్చే్ ఎన్నికల్లో గెలుపు ఎలా అన్న తర్జనభర్జనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యేలు ప్రజల్లో చురుగ్గా తిరగాలని వారి సమస్యలు తీర్చాలని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.

ప్రభుత్వ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోడానికి… సిట్టింగ్ ఎమ్మెల్యేలే కారణమన్న అభిప్రాయంలో పార్టీ ఉంది. ఇలాంటి తరుణంలో ప్రజలలో వ్యతిరేకత ఉందన్న నెపంతో ఆయా నియోజకవర్గాలకు అదనపు ఇన్‌చార్జీల నియమిస్తూ కొత్త మైండ్ గేమ్‌కు జగన్ తెరతీసారని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 60 నుండి 70 మంది అభ్యర్థులను మారుస్తారన్న వార్తలు నేపథ్యంలో ఆ మార్చిన నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉండటంతో ఆ స్థానాల్లో గెలవడం జగన్ కు కష్టమని అంటున్నారు. కొన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో కూడా ఎంపీలపై భారీ ప్రతికూలత ఉండటంతో ఆ అభ్యర్థులను కూడా మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చెబుతున్నారు. సర్వేల ఫలితాల నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు పూర్తిగా దిగజారకముందే ఆ నియోజకవర్గాల అభ్యర్థులను మార్చటానికి అదనపు ఇన్‌చార్జీల పేరుతో వారిని జగన్ నియమిస్తున్నట్లు సమాచారం.

వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ద్వితీయ శ్రేణి నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ప్రజలకు పనిచేసే అవకాశం కూడా లేకపోవడంతో తమను ఎవరు లెక్క చేయటం లేదని భావనలో కొందరు నేతలున్నారు. వారంతా ఈసారి ఎన్నికల నాటికి పార్టీ కోసం పని చేస్తారా అనేది కూడా ఇప్పుడు సందిగ్ధత పార్టీలో ఉంది. కానీ ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వారికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు మాట. ఉభయగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ క్లీన్ స్వీప్ చేస్తారంటున్నారు. అలానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు అతితక్కువ మెజార్టీతో గెలుపొందారు. అలాంటి నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల్లో వారి అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎక్కువ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఏపీలో అధికారం చేపట్టడం ఖాయమనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.

ఈసారి జరగబోవు ఎన్నికలు ప్రతి పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారటంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా ఏ పార్టీ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎలా అయినా గెలవాలి అనే లక్ష్యం పెట్టుకొని ప్రతి పార్టీ అడుగుల ముందుకు వేస్తున్నాయి. వైయస్సార్సీపిని గద్దేదించడమే లక్ష్యంగా మిగిలిన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధిస్తాయని రాజకీయ వర్గాలు అంటున్న నేపథ్యంలో ఇదంతా టీడీపీ చేస్తున్న నెగిటివ్ ప్రచారం అని తమ పార్టీకి మంచి ప్రజాధరణ ఉందని మరోసారి అధికారం తమదేనని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పొత్తు పొడిచి వైసీపీని గద్దె దించుతారా ? జగన్ వ్యూహాలు తట్టుకోలేక రెండు పార్టీలు చతికిల పడతాయా అన్నది తేలాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.