Home Page SliderTelangana

పటాన్‎చెరులో కారు జోరు కొనసాగేనా?

పేరుకు మెదక్ జిల్లా నియోజకర్గమైనా పటాన్‌చెరు, హైదరాబాద్ శివారుగా ఉండటంతో సిటీగా మారిపోయింది. శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో పటాన్‌చెరు ఒకటిగా నిలిచింది. ఇక్కడ్నుంచి గతంలో విజయం సాధించిన మహిపాల్ రెడ్డికి పార్టీ మరోసారి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఇక బీఎస్పీ నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధుకు పార్టీ తొలుత టికెట్ కేటాయించినా శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడికి తలొగ్గి అభ్యర్థిని పార్టీ మార్చింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కోసం గట్టిగా పనిచేశాడన్న భావనతో తిరిగి పార్టీ ఆయనకు టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు విజయంపై దీమా వ్యక్తం చేస్తున్నా… అధికార పార్టీ ఈసారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది.

ఇక పటాన్‌చెరు నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 391, పురుష ఓటర్లు 1,96,357 మంది కాగా, మహిళా ఓటర్లు 1,84,514 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్ జెండర్లు 77 మంది ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 3,80,948 ఉన్నారు. ఇండస్ట్రియల్ నియోజకవర్గంగా పేరు పొందిన పటాన్‌చెరులో ముదిరాజ్‌లు, ముస్లింలు భారీ సంఖ్యలో ఉన్నారు. ముదిరాజ్ లు 13 శాతానికి చేరువగా ఉండగా, ముస్లింలు సైతం 12 శాతానికి దగ్గరగా ఉన్నారు. మాదిగలు 10 శాతం ఉండగా, మాలలు, గౌడలు 8 శాతానికి పైగా ఉన్నారు. గొల్లులు 7 శాతం, రెడ్లు ఆరున్నర శాతం ఉన్నారు. వైశ్యులు నాలుగున్నర శాతం ఉండగా, మున్నూరు కాపులు, పద్మశాలీలు రెండున్నర శాతం మేర ఉన్నారు. ఇతరులు 17 శాతానికి పైగా ఉన్నారు.