Home Page SliderTelangana

ఉప్పల్ నియోజకవర్గంలో పైచేయెవరిది?

హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఉప్పల్ నియోజకవర్గం ప్రాముఖ్యత సంపాదించుకుంటోంది. హైదరాబాద్ మెట్రో ఏర్పాటు తర్వాత ఉప్పల్ నియోజకవర్గం ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డుకు వచ్చిందా అన్న భావన కలుగుతోంది. నగరానికి ఎక్కడ్నుంచి ఎక్కడకు వెళ్లాలన్న 40 నిమిషాల్లో చేరుకునేలా మెట్రో ఏర్పాటు చేయడంతో ఉప్పల్ హైదరాబాద్‌కు మకుటాయమానంగా మారింది. ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్, కాప్రా మండలాలున్నాయి. ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తోండగా, కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కంటెస్ట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి బేతిరెడ్డి సుభాష్ రెడ్డి విజయం సాధించగా, ఈసారి ఆయనకు గులాబీ పార్టీ టికెట్ నిరాకరించింది.

ఉప్పల్ నియోజకవర్గంలో 407 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఇక్కడ పురుషులు 2,65,493, మహిళలు 2,44,657 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్ 37 మంది ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గంపై ఈసారి కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ పోటీపడుతున్న తరుణంలో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఉప్పల్ నియోజకవర్గంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితోపాటు, ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. స్థానికులతో వీరి ఓట్లు కూడా గెలుపు ఓటములపై ప్రభావం చూపెడతాయి. ఇక ఉప్పల్ నియోజకవర్గంలో సామాజికసమీకరణాలను పరిశీలిస్తే… గౌడ్‌లు 11 శాతానికి పైగా ఉన్నారు. ముదిరాజ్‌లు 10 శాతం వరకు ఉన్నారు. ఎస్సీ 9, ఎస్టీలు 4 శాతం ఉండగా, రెడ్డి ఓటర్లు 5 శాతానికి పైగా ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు సైతం గణనీయంగా ఉన్నారు. సుమారు 8 శాతం మేర ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో యాదవులు 8 శాతం, ముస్లింలు సైతం 6 శాతం ఉన్నారు. ఇక ఎంబీసీలు సైతం ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలను నుంచి వచ్చిన పలు జిల్లాల్లోని తెలంగాణ వాసులు ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది. తాజాగా వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా కమ్మ సామాజికవర్గం నాయకులను అన్ని పార్టీల నేతలు కలుస్తున్నారు.