Andhra PradeshHome Page Slider

రాజధానిని ఎవరు కదిలించలేరు : చంద్రబాబు నాయుడు

2019 ఎన్నికల ముందు రాజధాని అమరావతి అక్కడే ఉంటుందని నమ్మించటంతో ప్రజలు జగన్ కు ఓట్లు వేశారని అప్పుడే మూడు రాజధానులు అని ఉంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఉండేవారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం గుండ్ల పాలెం లో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజధానిపై కులముద్ర వేశారని అన్ని కులాల వారు భూములు ఇచ్చారని అలాంటి చోట ఒక కులం పేరు పెట్టి రాజధానిపై కుట్ర చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక్కడ భూమి గట్టిగా ఉండదని ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అవుతుందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. అమరావతి భూములలో కుంభకోణం అన్నాడని కానీ కొండను తవ్వి ఎలుకను కాదు కదా వెంట్రుక కూడా పట్టుకోలేకపోయాడని విమర్శించారు. అసైన్డ్ భూములు అంటూ ఏవేవో ఆరోపణలు చేశారని అసైన్డ్ భూములకు కూడా ల్యాండ్ పూలింగ్‌లో డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ దని స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇవ్వలేదని తాము 2500 రైతు కూలీలకు ఇచ్చామన్నారు. గుంటూరు జిల్లాలో రాజధాని రావాలి అని ప్రజలందరికీ కోరికని రాష్ట్రానికి నడి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ అమరావతి ప్రాంతం అన్నారు. తాము కట్టిన అసెంబ్లీలో సచివాలయంలో కూర్చొని వాటిపై ఆరోపణలు చేస్తున్న ఫేక్ ఫెలో ఈ ముఖ్యమంత్రి అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు.

రాజధాని రైతులపై వందల కేసులు పెట్టారని 2000 మందిపై కేసులు నమోదు చేశారని అయినా న్యాయమే గెలుస్తుందని అమరావతి రాజధానిగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని ధరలు పెరిగాయని నిత్యవసర వస్తువులు భగ్గుమంటున్నాయని ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వివేకా హత్యలో షర్మిల వ్యాఖ్యలకు జగన్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైఎస్సార్సీపీ ఓడిపోవడం ఖాయం అన్నారు.