NationalNews

బీఆర్‌ఎస్‌ ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుంది?

దసరా పర్వదినాన జాతీయ పార్టీని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. డిసెంబరు మొదటి వారంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, బిహార్‌ నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, కర్ణాటక నుంచి జేడీఎస్‌ నేత కుమారస్వామి, గుజరాత్‌ నుంచి జేవీఎం నేత శంకర్‌సింగ్‌ వాఘేలా, తమిళనాడు నుంచి ‘విడుతలై చిరుతైగల్‌ కచ్చి’ పార్టీ నేత తిరుమావళన్‌ హాజరవుతారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మరికొందరిని ఆహ్వానిస్తున్నారు. ఏ రాష్ట్రం నుంచి ఎవరు హాజరవుతారో త్వరలో స్పష్టత వస్తుందని కేసీఆర్‌ అనుయాయులు చెబుతున్నారు.

తొలుత దక్షిణాది రాష్ట్రాలపై గురి..

భారత రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ప్రకటించినా.. తొలుత దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్‌ పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో పాగా వేయాలని స్కెచ్‌ గీస్తున్నారు. తొలి టార్గెట్‌ ఆంధ్రప్రదేశ్‌ కానుంది. విజయవాడలో త్వరలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించి ఏపీలో బీఆర్‌ఎస్‌ను పరిచయం చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో మంచి సంబంధాలు కలిగిన కేసీఆర్‌.. వచ్చే ఎన్నికల్లో ఆయనతో పొత్తు పెట్టుకుంటారా..? అనేది చూడాలి.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనే వార్తలొస్తున్నాయి. బీజేపీ కూడా పొత్తు పెట్టుకుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేస్తే ప్రధానంగా జగన్‌కు చెందిన వైసీపీ ఓట్లకే గండి పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే.. కేసీఆర్‌ టార్గెట్‌ చంద్రబాబు. దీంతో ఏపీలో తమ పార్టీ అధినేత ఎలాంటి రాజకీయ చతురతను ప్రదర్శిస్తారోనని కేసీఆర్‌ అనుయాయులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. కర్ణాటకలోని రాయచూర్‌, బీదర్‌, గుల్బర్గా, యాద్గిర్‌, కొప్పల్‌ జిల్లాలు, గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా, తమిళనాడు, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా తెలుగు వారు భారీగానే ఉన్నారు. వాళ్ల ఓట్లతో పాటు స్థానికులకు తెలంగాణ మోడల్‌ను చూపిస్తూ ఆయా ప్రాంతాల్లో పాగా వేసేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

బీజేపీకి లబ్ధి చేకూరుతుందా..?

కేసీఆర్‌ ముఖ్యంగా తెలంగాణ మోడల్‌ అంటూ ఎస్సీ, ఎస్టీ ఓట్లపై గురిపెట్టారు. రైతులపైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ముస్లిం ఓట్లను రాబట్టగలిగే శక్తి ఉన్న అసదుద్దీన్‌ ఒవైసీతో కలిస్తే అన్ని రాష్ట్రాల్లోనూ మెజారిటీ ప్రజలు తమ వెంట నడుస్తారనే ధీమాతో కేసీఆర్‌ ఉన్నారు. అందుకే విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో తాను నిర్వహించే సభల్లో ఒవైసీ పాల్గొనేలా కేసీఆర్‌ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కేసీఆర్‌-ఒవైసీ కలిస్తే అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఓట్లకు గణనీయంగా గండిపడుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. దీంతో కేసీఆర్‌ పెట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీతో జాతీయ స్థాయిలో బీజేపీకే లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.