బీజేపీ గెలవగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం
మునుగోడు, మనసర్కార్
బీజేపీ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్ రూ.3 వేలకు పెంచేందుకు ప్రధాని మోదీని ఒప్పిస్తానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. నిన్న మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి, లెంకలపల్లి, సరంపేట, శివన్నగూడెం, ఖుదాభక్షుపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సంపదను దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ అధికారంలోకి రాగానే జైలుకు పంపడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 15 రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌కు 90మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్‌లో ఉన్న 12మంది ఎమ్మెల్యేలను అంగడిలో గొర్రెల మాదిరిగా కొనుగోలు చేశారని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల గొంతునొక్కి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, నియోజకవర్గాలకే నిధుల మళ్లిస్తున్నారని అన్నారు. మునుగోడు అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చేందుకు అమిత్‌షా హామీ ఇచ్చారని, రూ.2లక్షల చొప్పున 50 వేల మంది మహిళలకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి నిర్మలసీతారామన్ హామీ ఇచ్చారని తెలిపారు. 14 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఓడించేందుకు డబ్బు, మద్యంతో కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.