సెప్టెంబర్ 17న ఏం జరగనుంది..?
ఒకరు విమోచన.. మరొకరు సమైక్యత.. సెప్టెంబరు 17వ తేదీన ఏం జరగనుంది..? ఆ రోజును తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ఈ ఏడాది సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనుంది. వచ్చే ఏడాది (2023) సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించుకుంది. సెప్టెంబరు 17న పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

కేంద్ర ప్రభుత్వం విమోచన దినం
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబరు 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కావడం విశేషం. అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర పారామిలటరీ బలగాల కవాతులో గౌరవ వందనం స్వీకరిస్తారు. సెప్టెంబరు 17 ప్రాధాన్యత గురించి, నిజాం నవాబు లొంగుబాటు గురించి అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

పోరాట యోధులను హతమార్చిన రజాకార్లు
హైదరాబాద్ రాష్ట్రం 75 ఏళ్ల క్రితం (1948, సెప్టెంబరు 17వ తేదీన) భారత యూనియన్‌లో విలీనమైంది. ఆ సందర్భంగా జరిగిన ప్రజాందోళనలో వేలాది మంది తెలంగాణ పోరాట యోధులను రజాకార్లు చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. పరకాలలో 35 మందిని కాల్చి చంపారు. బైరాన్‌పల్లిలో 90 మందిని దారుణంగా హతమార్చారు. హైదరాబాద్ రాష్ట్రంలో కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు ఉండేవి. భారత యూనియన్‌లో విలీనం తర్వాత ఆ ప్రాంతాలు ఆయా రాష్ట్రాల్లో విలీనమయ్యాయి. అందుకే అమిత్ షా నిర్వహించే కార్యక్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

సెప్టెంబరు 17ను మర్చిపోయిన కేసీఆర్
స్వాతంత్య్రం తర్వాత తెలంగాణాలో సెప్టెంబరు 17వ తేదీన కొంత కాలం పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించే వారు. ఆ తర్వాత దాన్ని మర్చిపోయారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన తర్వాత సెప్టెంబరు 17పై మళ్లీ చర్చ మొదలైంది. తాను అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారు. మజ్లిస్ పార్టీ ఒత్తడికి లొంగి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి.. ఈ ఏడాది సెప్టెంబరు 17న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ కార్యక్రమాలతో తెలంగాణ హీటెక్కనుంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఉత్కంఠత రేకెత్తించనుంది.