స్కూల్ కోసం యజమాని ఏం చేశాడంటే.. తెలిస్తే షాక్..
ఓవైపు సాంకేతికంగా దూసుకుపోతున్న భారత్.. మరోవైపు మూఢ విశ్వాసాలకు వేదికగా నిలిచింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. చిన్నారిని బలి ఇస్తే స్కూలు మరింత వృద్ధిలోకి వస్తుందన్న మూఢ విశ్వాసంతో ఒక పాఠశాల యజమాని సొంత స్కూలు విద్యార్థినిని చంపేసిన ఘటన హాథ్రాస్ జిల్లాలోని జరిగింది. రాస్గవాన్ గ్రామంలో ఈనెల 23వతేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో స్కూల్ యజమాని, డైరెక్టర్, ప్రిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లాడిని గొంతు నులిమి చంపేశారని పోస్ట్ మార్టమ్ నివేదికలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఎల్ పబ్లిక్ స్కూల్ యజమాని జశోధన్ సింగ్ తాంత్రిక శక్తులను బాగా విశ్వసిస్తాడు. కుటుంబ సమస్యలు పోయి స్కూల్ కు మంచి పేరు, వృద్ధిలోకి రావాలంటే చిన్నారిని బలి ఇవ్వాల్సిందేనని కుమారుడు, స్కూల్ డైరెక్టర్ దినేశ్ బఘేల్ చెప్పాడు. దీంతో క్షుద్ర పూజలు చేసి పిల్లాడిని చంపాలని తండ్రీ కొడుకులు పథకం రచించారు. వీరికి ప్రిన్సిపల్ లక్ష్మణ్ సింగ్, ఉపాధ్యాయులు రాంప్రకాశ్ సొలంకీ, వీర్ పాల్ సింగ్ జతకలిశారు. బలి ఇచ్చేందుకు రెండో తరగతి చదివే తొమ్మిదేళ్ల కృతార్ధ్ ను ఎంచుకున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన స్కూల్ హాస్టల్ గదిలో నిద్రపోతున్న పిల్లాడిని ఎత్తుకొచ్చి స్కూల్ ప్రాంగణంలోని ఒక గదిలో పడుకోబెట్టి క్షుద్ర పూజలు మొదలెట్టారు. కొద్దిసేపటికి పిల్లాడు లేచి ఏడ్వడంతో భయపడి వెంటనే టీచర్ సోలంకీ పిల్లాడి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత పిల్లాడి తండ్రికి ఫోన్ చేసి “మీ అబ్బాయికి ఒంట్లో బాగోలేదు. స్కూల్ డైరెక్టర్ తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు” అని చెప్పాడు. అనుమానంతో తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కారులో పిల్లాడి మృతదేహంతో పారిపోతున్న దినేశ్ బఘేల్ కారును అడ్డగించి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

