Andhra PradeshNewsNews Alert

ఏది వాస్తవం..? ఏది అవాస్తవం..?


దింగబర రాజకీయమే ఇప్పుడు ఏపీని ఊపేస్తోంది. నీలిచిత్ర సంభాషణల చుట్టూనే రాజకీయాలన్నీ పరిభ్రమిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు పదునెక్కుతున్నాయి. పనిలో పనిగా వ్యక్తిగత దూషణలూ జోరందుకున్నాయి. ఎవరూ తగ్గడం లేదు. వెనకడుగు వేయడం లేదు. సూత్రధారి .. పాత్రధారి గోరంట్లే నంటోంది టీడీపి. అధికారపక్షం మాత్రం ఆయన కడిగిన నిప్పుంటోంది. మాధవ లీలలు వాస్తవేమంటూ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ను కూడా చూపిస్తోంది టీడీపీ. అయితే.. అదంతా ఫేక్. అదో తప్పుడు నివేదిక అంటూ కొట్టి పారేస్తోంది వైసీపీ. ఇప్పుడు ఏపీ సీఐడీ రంగంలోకి వచ్చింది. టీడీపీ వారు చూపుతున్న ఫోరెన్స్ రిపోర్ట్ ఒరిజనల్ కాదంటూ అధికార పక్షానికి వంత పాడింది. దీంతో విమర్శలు టర్న్ అయ్యాయి. సంబంధం లేని వాళ్ళు వచ్చి వీడియో పై వివరణ ఇవ్వడం ఏంటంటూ టీడీపీ మండిపడుతోంది. ఈ పరిణామాలతో మాధవ్ ఎపిసోడ్ రసవత్తరంగా మారింది.


హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన వీడియో కాల్ వ్యవహారంపై ఇంకా అగ్గి రగులుతూనే ఉంది. వాస్తవాలను బయటకు తెచ్చేందుకు విపక్షం ప్రయత్నిస్తూనే ఉంది. వివాదంగా మారిన వీడియోను అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నివేదికను తీసుకు వచ్చింది. ఆ వీడియో వందకు వంద శాతం వాస్తమే నంటూ విపక్షం వాదిస్తోంది. ఆ వీడియోలో ఉన్నది మాధవే నంటూ బల్లగుద్ది చెబుతోంది. అయితే విపక్షాల విమర్శలను తిప్పి కొడుతూ అధికార పార్టీ వైసీపీ ఆత్మ రక్షణ చర్యలకు దిగింది. మాధవ్ పై వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా ఫేక్ అంటూ అది మార్ఫింగ్ చేసిందని విపక్షాలపై ప్రతి దాడికి దిగింది. తనపై బురదచల్లేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని.. అసలు ఆ వీడియో సూత్రధారులు టీడీపీ నేతలేనంటూ మాధవ్ కూడా ఎదురుదాడికి దిగారు. మార్ఫింగ్ చేసిన వీడియోను పట్టుకుని అందరినీ పక్కదారి పట్టించే పనులకు ఒడిగడుతున్నారంటూ టీడీపీ నేతలపై తనదైన స్టైల్లో మాటలు పేలుతున్నాడు. ఈ పరస్పర ఆరోపణల మధ్య అసలు నిజమేంటి అన్నది అర్ధం కాకుండా పోయింది.


మాధవ్ వీడియో ఒరిజనలా కాదా అన్న అంశం నుండి .. ఇప్పుడు టీడీపీ తీసుకు వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక ఒరిజనలా కాదా అన్న అంశంపై నే చర్చ మొదలైంది. అసలు విషయం పక్కదారి పట్టింది. విపక్షం చూపిస్తున్న నివేదిక వాస్తవమా కాదా అన్నది తేల్చాలని ప్రభుత్వం సీఐడీ అధికారులను కోరింది. దీంతో అన్ని విషయాలను పూర్తిగా విచారించిన తర్వాత ఆ శాఖ చీఫ్ మీడియా ముందుకు వచ్చారు. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్టుకు ఎంత సాధికారిత ఉందో చెప్పలేం. అసలు, ఆ సంస్థ ఇచ్చినట్టు చెబుతున్న నివేదిక పూర్తిగా అబద్ధం.. అందులో నిజం లేదు. అది వాస్తవం కాదంటూ సిఐడీ చీఫ్ సునీల్ కుమార్ వాదిస్తున్నారు. ఎక్లిప్స్ ల్యాబ్ కు చెందిన జిమ్ అనే వ్యక్తిని ఈమెయిల్ ద్వారా సంప్రదించగా.. తన పేరిట వెలువడిన నివేదిక ఒరిజినల్ కాదని స్పష్టం చేసినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లు సీఐడీ చీఫ్ సునీల్ తెలిపారు. దీంతో ఈ వ్యవహారం అంతా గందరగోళంగా మారింది. ఏది వాస్తవం.. ఏది అవాస్తవం అన్న చర్చ మొదలైంది.


ఇదరు వ్యక్తుల మద్య జరిగిన వీడియో కాల్ సంభాషణను మూడో వ్యక్తి ఎవరో చిత్రీకరించాడు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది మూడో వ్యక్తి చిత్రీకరించిన వీడియోనే అంటున్నారు సీఐడీ అధికారులు. వాస్తవంగా మాధవ్ ఫోన్ కానీ.. ఆయన ఎవరితో సంభాషించాడని భావిస్తున్నారో ఆవిడ ఫోన్ కానీ ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. వారిద్దరి ఫోన్లను విశ్లేషిస్తే కానీ వాస్తవం తేలదు. వాస్తవంగా తానిచ్చిన సర్టిఫికేట్ కు .. టీడీపీ వారు చూపుతున్న సర్చిఫికేట్ కు చాలా తేడా ఉంది కాబట్టి అది ఫేక్ అంటూ జిమ్ చెప్పారని సీఐడి అంటోంది. దీంతో ఫేక్ సర్టిఫికెట్లను ప్రచారం చేసినందుకు టీడీపీ నేతలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అంటున్నారు. అశ్లీల వీడియోను సృష్టించడంతో పాటు దాన్ని ప్రచారంలోకి తెచ్చినందుకు టీడీపీ వారే నేరాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం టీడీపీ, జనసేన నేతలు కలిసి ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మాధవ్ ను అన్ని రకాలుగా కాపాడాలని అటు ప్రభుత్వం.. ఇటు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ కూడా ఘాటుగానే విమర్శలకు దిగింది. సంబంధం లేకుండా సీఐడీ వాళ్ళు వచ్చి వీడియోపై వివరణ ఇవ్వడం ఏంటంటూ ఆ పార్టీ నేత వంగలపూడి అనిత తప్పుబట్టారు. మొత్తానికి ఈ వ్యవహారం పూర్తిగా పక్కదారి పడుతోంది.


వారిదో వ్యూహం. హిందూపురంలో పట్టుకోసం చేస్తున్న ప్రయత్నం. దొరకక దొరికిన ఓ ఫేక్ వీడియోతో సంచలనం రేపి, లబ్ది పొందాలన్న కుతంత్రం అంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఈ వ్యవహారాన్ని అంత తొందరగా టీడీపీ వదిలేట్టు కనిపించడం లేదు. నిజం నిగ్గు తేలాల్సిందే అంటూ పట్టు బిగిస్తోంది. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి అసభ్య, అశ్లీల వ్యవహారాలలో మునిగి తేలడం ఏంటంటూ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు మేం తగ్గం అంటూ తెగేసి చెబుతోంది. ఎవరి రాజకీయాలు వారివి. ఎవరి ఎత్తుగడలు వారివి. కానీ.. నిజమేంటి? ఇదే ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్న.