NewsNews AlertTelangana

పీడీ యాక్ట్‌ అంటే ఏంటి..?

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. దీంతో ఆయనకు ఏడాది వరకు బెయిల్‌ కూడా దొరకదని, ఆయనపై పెట్టిన కేసులు కోర్టులో నిరూపితమైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. నిజానికి ఈ పీడీ యాక్ట్‌ అంటే ఏంటి? పీ అంటే ప్రివెంటివ్‌ (ముందస్తు).. డీ అంటే డిటెన్షన్‌ (నిర్బంధం).. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉన్న వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేస్తారన్నమాట. జైలుకు వెళ్లొచ్చినా మార్పురాని వారిపై పీడీ చట్టం అమలు చేస్తారు. పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదైన వారు ఏడాది పాటు జైలులో ఉండాల్సిందే. 6 నెలల వ్యవధిలో ఒకే తరహా నేరాలు మూడు కంటే ఎక్కువ చేయడం లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసులు ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. రౌడీలు, గొలుసు దొంగలు, జూదం నిర్వాహకులు, నకిలీ విత్తనాల తయారీదారులు, సైబర్‌ నేరగాళ్లు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై పోలీసులు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు. గత 8 ఏళ్లలో 2,500కు పైగా మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. పీడీ చట్టం ప్రయోగించిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది.

పీడీ యాక్ట్‌పై సుప్రీం చీవాట్లు

చిన్న నేరాలకే పీడీ యాక్ట్‌ను ప్రయోగించారంటూ పోలీసులను సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక నేరస్థుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందో వివరిస్తూ నిందితుడికి పోలీసులు వివరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. పీడీ చట్టం అమలుకు సంబంధించి సలహా సంఘం ఉంటుంది. ఈ సలహా సంఘం ముందు వాదనలు జరుగుతాయి. పోలీసుల వాదనను సలహా సంఘం ఆమోదిస్తే పీడీ చట్టం కొనసాగుతుంది. పీడీ చట్టాన్ని నిందితుడు హైకోర్టులో సవాల్‌ చేయొచ్చు. రాష్ట్రంలో పీడీ యాక్ట్‌ కింద గత ఏడాది 664, 2020లో 350, 2019లో 360 కేసులు నమోదు చేశారు.

రాజాసింగ్‌పై రౌడీషీట్‌ కూడా..

రాజాసింగ్‌పై 2004 నుంచి ఇప్పటి వరకు 101 కేసులు ఉన్నాయని, అందులో 18 మతపరమైన కేసులని పోలీసులు పేర్కొన్నారు. ఆయనపై మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ కూడా తెరిచారు. తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలతో హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించేందుకు రాజాసింగ్‌ ప్రయత్నిస్తున్నారన్నది పోలీసుల ప్రధాన ఆరోపణ. ఈ నెల 22వ తేదీన సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియో ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని, అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్న పోలీసులు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలతో ఆయనపై పీడీ యాక్ట్‌ పెట్టామన్నారు. ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలోనూ మరో వీడియో విడుదల చేస్తానని మీడియాకు తెలిపారని పోలీసులు చెప్పారు. ఆయన మరో వీడియోను విడుదల చేస్తే నగరంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నందునే చర్యలు చేపట్టామన్నారు. రాజాసింగ్‌ విడుదల చేసిన వీడియో వల్లే నగరంలో నిరసనలు, ప్రదర్శనలు జరిగాయని, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, వ్యాపార సముదాయాలు మూతబడ్డాయని పోలీసులు పేర్కొన్నారు. రాజాసింగ్‌ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.