వెయ్యి రోజుల యుద్ధం ఏం మిగిల్చింది?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేటితో వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఈ శతాబ్దంలోనే అతి పెద్ద యుద్ధంగా నిలిచింది. 2022 నుండి కొనసాగుతున్న ఈ పోరులో సైనిక చర్యలు, క్షిపణి దాడులతో పరస్పరం కలియబడ్డారు. లక్షలాది మంది సైనికులను కోల్పోయారు. ఉక్రెయిన్ పాక్షిక స్మశానంగా మారింది. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉక్రెయిన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆదేశ సైనికులు 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల మందికి పైగా గాయపడ్డారు. సామాన్య పౌరులు దాదాపు 12 వేల మంది ప్రాణాలు కోల్పోతే, 25 వేలమంది గాయపడ్డారు. వారిలో చిన్నారులే 600 మంది ఉండవచ్చని పేర్కొన్నారు. కానీ వాస్తవంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 60 లక్షల మంది దేశాన్ని విడిచి పెట్టారు. దేశంలో హౌసింగ్, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పునర్నిర్మాణం కోసం దాదాపు 500 బిలియన్ డాలర్ల ఖర్చు కావచ్చని ప్రభుత్వ అంచనా.
అటు రష్యా అధినేత పుతిన్ కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గానీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. భారత లాంటి దేశాల రాయబారాలు విఫలమయ్యాయి. ఉక్రెయిన్‌తో పాటు రష్యాలో కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. అయితే రష్యా సైనికుల మరణాలపై సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఒక అంచనా ప్రకారం 2 లక్షల సైనికులు ప్రాణాలు కోల్పోతే, 4 లక్షల మంది గాయపడినట్లు సమాచారం. సామాన్యపౌరుల విషయం తెలియరాలేదు. ఈ రెండుదేశాలలో జననాల రేటు భారీగా తగ్గిపోయింది. ఎవరూ పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేరు. రెండు దేశాలలో వందలకొద్దీ బిలియన్ డాలర్ల నష్టం జరిగింది.

