ఢిల్లీలో ఏం జరుగుతోంది?.. ఆప్ సర్కారు పరిస్థితి ఏంటి?
ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కారుకు కష్టకాలం ఎదురైందా? ఓ వైపు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు.. నేడో, రేపో తనను అరెస్టు చేస్తారంటూ సిసోడియా ఆందోళన.. మరోవైపు బీజేపీ రూ.20 కోట్ల ఆఫర్ చేసిందంటూ ఆప్ ఎమ్మెల్యేల ఆరోపణ.. ఈ నేపథ్యంలో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఎంత మంది డుమ్మా కొట్టారు?
ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాత్రం అందరూ హాజరయ్యారని, నేరుగా హాజరు కాలేనివారు వర్చువల్‌గా పాల్గొన్నారని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 9-12 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఫోన్‌లోనూ వారు అందుబాటులో లేరు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

అత్యవసర సమావేశం ఎందుకు?
కేజ్రీవాల్‌కు అకస్మాత్తుగా అత్యవసర సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇళ్లపై సీబీఐ ఇటీవల దాడులు నిర్వహించింది. ప్రభుత్వ అధికారులతో సహా మరో 14 మంది ఇళ్లలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. తనను రెపో, మాపో అరెస్టు చేస్తారని సిసోడియా ఇటీవల తన ట్విటర్ ద్వారా ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు తమను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీజేపీలోకి వస్తే రూ.20 కోట్లు ఇస్తామని, తమ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలను తీసుకొస్తే రూ.25 కోట్లు ఇస్తామని బీజేపీ పెద్దలు తమకు ఆఫర్ ఇచ్చారని విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు.