Home Page SliderNational

ప్రాణాలు పణంగా పెడితే ఇంతేనా.. మండిపడ్డ ‘ర్యాట్ హోల్’ మైనర్లు

ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగం ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సొరంగంలో 16 రోజుల పాటు చిక్కుకుపోయిన 41మంది కార్మికులను వీరోచితంగా కాపాడిన 12 మంది ర్యాట్‌హోల్ మైనర్లు  తగిన ప్రతిఫలం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, అత్యంత ప్రమాదమైన ర్యాట్ హోల్ మైనింగ్ విధానంలో వీరు కూలీల ప్రాణాలను కాపాడారు. అయితే వీరికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ కేవలం ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు విఫలమై, యావద్దేశం పాలుపోని స్థితిలో ఉన్నప్పుడు, ఎలాంటి షరతులు విధించకుండా, ప్రమాదకరమైన మార్గంలో సొరంగంలోకి అడుగుపెట్టి శిథిలాలను తొలగించి,కూలీల ప్రాణాలు కాపాడామని వారు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం తమకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయిందని బాధను వ్యక్తం చేశారు. మా సేవలను గుర్తించి, తమకు జీవనోపాధికి ఉద్యోగమో, లేదా నివాసానికి ఇల్లు కానీ ఇస్తే తమ త్యాగానికి తగిన ఫలితం దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెక్కులు తమ మనోధైర్యాన్ని తగ్గిస్తున్నాయని, త్వరలో తమకు మంచి పారితోషకం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. వారి మాట నిలబెట్టుకోకపోతే ఈ చెక్కులు తిరిగి ఇచ్చేస్తాం అని ఈ ర్యాట్ హోల్ బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ పేర్కొన్నారు.