రోజూ 11 నిమిషాలు వేగంగా నడిస్తే ఏమవుతోంది..?
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే ప్రతిరోజూ కనీసం 11 నిమిషాలు వేగంగా నడిస్తే 10 అకాల మరణాలలో ఒకటి నివారించొచ్చని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. అయితే.. పూర్తిగా వ్యాయామం చేయకపోవడం కంటే ఎంతో కొంత చేయడమనేది నయమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. వారానికి 150 నుంచి 300 నిమిషాల సాధారణ శారీరక శ్రమ కానీ.. 75 నుంచి 150 నిమిషాల విపరీతమైన యాక్టివిటీ కానీ ఉంటే గుండె కొట్టుకునే రేటు పెరుగుతుందని ఎన్ హెచ్ ఎస్ చెప్తోంది. రోజుకు 11 నిమిషాల పాటు యాక్టివిటీ ఉంటే హృద్రోగాలను 17 శాతం, క్యాన్సర్ ను 7 శాతం నివారించవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అకాల మరణం అవకాశం ఎక్కువ. అందుకే రోజులో కనీసం 11నిమిషాలు వేగంగా నడిస్తే శరీరంలోని కొవ్వు, అధిక రక్తపోటు తగ్గుతుంది. శరీర దారుఢ్యం పెరగడంతో పాటు నిద్ర, గుండె ఆరోగ్యం దీర్ఘకాలంలో మెరుగుపడుతుంది. అలాగే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఎవరైతే ప్రతిరోజూ వాకింగ్ చేస్తారో వారికి ఆరోగ్య సమస్యలు తక్కువగా రావడంతో పాటు ఆయుష్షు కూడా పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది. 11 నిమిషాలు వేగంగా నడవడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండెకు రక్త ప్రసరణ పెరిగి.. ఇతర అవయవాలకు ఆక్సిజన్, ఇతర పోషకాల సరఫరా పెరుగుతుంది. దీని వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని తేలింది. అలాగే ఒత్తిడి తగ్గడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది.

