సీఎం అయితే నాకేంటి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభా నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు . సీఎం రేవంత్ రెడ్డి రాకను గమనించిన మాజీ సీఎం కేసీఆర్ వెంటనే లేచి నిలబడి, హుందాతనంతో కరచాలనం చేశారు . కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం తమ సీట్లలోనే కూర్చుని ఉండిపోయారు.పక్కనే ఉన్న కేటీఆర్ కనీసం సీటు నుంచి లేవకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సభా సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కేటీఆర్ విస్మరించారని, ఇది ఆయన అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే, కేటీఆర్ మద్దతుదారులు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. తమ పార్టీ అధినేతపై నిరంతరం అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని, రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నది కేవలం ‘పొలిటికల్ డ్రామా’ మాత్రమేనని బీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి. మరోవైపు, ఈ వివాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాను సభలోని ప్రతి సభ్యుడిని గౌరవిస్తానని, అందులో భాగంగానే కేసీఆర్‌ను పలకరించానని స్పష్టం చేశారు. ఏదేమైనా, కేసీఆర్ ప్రదర్శించిన రాజకీయ పరిపక్వతకు, కేటీఆర్ వ్యవహరించిన తీరుకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

