మస్క్ పిల్లలకు ప్రధాని మోదీ ఏమిచ్చారంటే..
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయన కుటుంబాన్ని కలిశారు. మస్క్ ముగ్గురు పిల్లలకు ఆయన భారతీయ సాహిత్యానికి చెందిన పుస్తకాలు బహుమతులుగా ఇవ్వడం విశేషం. వీటిలో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘ది క్రెసెంట్ మూన్’, ప్రాచీన సంస్కృత కవి విష్ణుశర్మ రచించిన బాలల కథలు ‘పంచతంత్ర’, ప్రముఖ రచయిత ఆర్‌కే నారాయణ్ రాసిన ‘మాల్గుడి డేస్” వంటి పుస్తకాలు ఉన్నాయి. ఈ చిత్రాలను ప్రధాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మస్క్ కుటుంబాన్ని కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మస్క్‌తో సమావేశంలో స్పేస్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలలో భారత్, యూఎస్‌లకు చెందిన సంస్థల మధ్య సహకారం గురించి చర్చించినట్లు మోదీ తెలిపారు. ప్రస్తుత అమెరికా పాలనలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ( డోజ్) శాఖ సారథిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు మస్క్. ఈ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ట్రంప్ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా పాస్ చేశారు.