సిబిల్ స్కోర్ కారణంగా పెళ్లి క్యాన్సిల్..
సాధారణంగా వివాహ సంబంధాలు కుదరాలంటే వరుడు, వధువుకి సంబంధించిన ఆస్తిపాస్తులు, చదువు, అందచందాలే కీలక పాత్ర పోషిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. మన క్రెడిట్ స్కోర్ కూడా పెళ్లిని ప్రభావితం చేస్తోంది. పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఒక యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి కుదిర్చారు. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే ఈ లోగా పెళ్లి కుమార్తె మేనమామ వరుడి సిబిల్ స్కోర్‌ను చెక్ చేశారు. దీనిలో అతడు అనేక బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడంతో వధువు తరపు వారు ఈ పెళ్లికి నిరాకరించారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అమ్మాయిల వివాహానికి ముందు అన్ని విషయాలు చెక్ చేసుకోవాలని, అప్పుడే వారికి సరైన భవిష్యత్తును అందించగలరని కామెంట్స్ చేస్తున్నారు.