Home Page Sliderhome page sliderInternational

కొత్త సుప్రీంను చంపేస్తాం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణాంతనంతరం , ఆ దేశ తదుపరి పగ్గాలు చేపట్టబోయే నాయకుడిపై ఇజ్రాయెల్ ముందస్తుగానే “మరణశాసనం” రాసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోషల్ మీడియా వేదికగా బుధవారం చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత నెల 28న ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించిన విషయం తెలిసిందే. ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్‌గా ఇరాన్ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తుండటంతో ఇజ్రాయెల్ తన హెచ్చరికల తీవ్రతను మరింత పెంచింది.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పందిస్తూ, “ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి లేదా స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరించడానికి ప్రయత్నించే ఏ నాయకుడైనా మా నిర్మూలన లక్ష్యంలో ఉంటారు. అతని పేరు ఏదైనా, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని హీబ్రూ భాషలో స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా ఈ మిషన్‌ను పూర్తి చేయాలని తాను ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ దళాలను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు ప్రస్తుత పాలనను కూల్చివేసి, కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదని, ఇరాన్ అంతర్గత రాజకీయాలపై ఇజ్రాయెల్ చేస్తున్న నేరుగా దాడి అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌లోని 88 మంది సభ్యుల నిపుణుల అసెంబ్లీ ఇప్పటికే మోజ్తాబా ఖమేనీని వారసుడిగా ఎన్నుకున్నట్లు సమాచారం అందుతోంది. సుప్రీం లీడర్‌కు ఉండాల్సిన అత్యున్నత మతపరమైన అర్హతలు మోజ్తాబాకు ఉన్నాయా లేదా అనే అంశంపై ఇరాన్ మత పెద్దల మధ్య ఇంకా అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఈ ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్యే, దివంగత నేత అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సిద్ధమవుతోంది. బుధవారం రాత్రి 10 గంటల నుండి టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ ప్రార్థన మందిరంలో ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మూడు రోజుల పాటు సాగే ఈ వీడ్కోలు కార్యక్రమాల వేళ, ఇజ్రాయెల్ నుంచి అందుతున్న బహిరంగ హత్య బెదిరింపులు ఇరాన్‌ను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు సుప్రీం లీడర్ అంత్యక్రియల సన్నాహాలు, మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటనలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరి, ఏ క్షణమైనా పెను విధ్వంసం సంభవించేలా కనిపిస్తోంది.