Home Page SliderTelangana

తెలంగాణలో ‘ఇందిరమ్మ రాజ్యాన్ని’ స్థాపిస్తాం.. డిప్యూటీ సీఎం

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడమే ప్రజాపాలన ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన భట్టి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వమని, ఓ వర్గానికి, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం తమది కాదని, రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేసే ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. గడిచిన దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని గుర్తు చేశారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం పేద కుటుంబాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాయన్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికె తమ ప్రభుత్వం ప్రజల చెంతకే వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేపట్టిన కార్యక్రమమే ప్రజాపాలన అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట తాను పాదయాత్ర చేసిన సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని వివరించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి, రసీదు పొందాలని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు చేయాలి అనే నిబంధన లేదు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ద్వారా కూడా అప్లయ్ చేసుకోవచ్చు, వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హన్మంతు, స్పెషల్ ఆఫీసర్ శృతి ఓజా, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, సీపీఓ సౌమ్య, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత రెడ్డి, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్ కిరణ్, ఎంపిపి రేఖ మహేందర్, జెడ్పీటీసీ బీంగీ దాస్, సంబంధిత అధికారులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.