సీజేఐపై దాడిని ఖండిస్తున్నాం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా పేర్కొంటూ, రాజ్యాంగ పరిరక్షకులైన రాజకీయ నాయకులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.సుప్రీంకోర్టు అంటే ఒక్క వ్యక్తి కాదని , అది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే అత్యున్నత వ్యవస్థ అని వినోద్ కుమార్ అన్నారు. దేశ ప్రజాస్వామ్యం లెజిస్లేచర్, జ్యుడీషియరీ, ఎగ్జిక్యూటివ్ అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉందని, వీటిలో ఒకటి బలహీనమైతే ప్రజాస్వామ్య వ్యవస్థనే కూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
న్యాయవ్యవస్థ ప్రజల పౌరహక్కులు, ప్రాథమిక హక్కులు, సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తోందని ఆయన గుర్తుచేశారు . న్యాయవ్యవస్థపై దాడి అంటే రాజ్యాంగంపై దాడి చేసినట్టేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నాయకులు పద్ధతి మార్చుకోవాలి దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రజల్లో ద్వేషాన్ని పెంచుతున్నారని విమర్శించిన ఆయన, ఆ భాషా సంస్కృతి మార్చుకోకపోతే సమాజంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు, లాయర్ లు ఇలాంటి దాడులకు పాల్పడటానికి కారణం నేతలేనని తమ వెనుక నాయకులు ఉన్నారనే ధీమా వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
పార్టీలు బాధ్యతగా వ్యవరించాలి రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణలో పాలక పార్టీలు, ప్రధాన ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సుప్రీంకోర్టుపై దాడి వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోతే ప్రజాస్వామ్యం మూలాలతో కూలిపోతుందని , ప్రజాస్వామ్య విలువల రక్షణ అందరి బాధ్యత అని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.