అధికారంలోకి వచ్చేది మేమే
బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. సూర్యాపేటలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రపై కసరత్తు జరుగుతోందని, తాను సిద్ధం అవుతున్నానని, అధినేత కేసీఆర్ అనుమతితో వచ్చే ఏడాది పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను జిల్లాల పర్యటనలు ప్రారంభించానన్న కేటీఆర్, డిసెంబర్ వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో నిమగ్నం అవుతామని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవాలతో పాటు శిక్షణా తరగతులు, సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు సంస్థాగత కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందని, సూర్యాపేట కార్యక్రమానికి బహిరంగ సభ తరహాలో జనం తరలివచ్చారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ తెలిపారు
