జీతాలు లేక ఇబ్బందులకు గురవుతున్నాం.. మెట్రో టికెటింగ్ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ కౌంటర్లలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఎల్‌బినగర్ – మియాపూర్ కారిడార్‌లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్నప్పుడు రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికీ సమయం కూడా ఇవ్వడం లేదని తమ బాధను వ్యక్తం చేశారు. వేతనాలు పెంచే వరకు తాము డ్యూటీలో చేరమని తేల్చి చెప్పారు. దీనిపై కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పస్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేసే వరకు మా నిరసనను కొనసాగిస్తామని ఉద్యోగులు తెలిపారు. నిరసన చేపట్టడంతో.. ఇతర ఉద్యోగుల చేత టికెట్లు జారీ చేయిస్తుండటంతో ఆలస్యం అవుతుంది. దీంతో టికెట్ల కోసం కొన్ని మెట్రో స్టేషన్‌లలో ప్రయాణికులు బారులు తీరారు. ఎల్‌బినగర్ – మియాపూర్ కారిడార్‌లోని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ఉద్యోగుల నిరసనపై మెట్రో నిర్వాహకులు సీరియస్ అయ్యారు. టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ట్రైన్ ఆపరేషన్ నిలిపివేసేందుకే సిబ్బంది డ్యూటీల్లోకి రాలేదన్నారు. సమయం ప్రకారమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. ధర్నా చేస్తున్న సిబ్బందిపై సీరియస్ అయ్యారు. నిరసన తెలియజేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.