home page sliderNationalSports

మేం అమ్మకానికి సిద్ధంగా లేం’..ఆర్సీబీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని విక్రయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ ఫ్రాంఛైజీ యాజమాన్య కంపెనీ డియాజియో స్పందించింది. ఫ్రాంఛైజీని అమ్ముతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ఇవన్నీ ఊహాజనిత వ్యాఖ్యలని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రచారానికి తెరదించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి.. తొలి టైటిల్ కైవసం చేసుకుంది. అయితే విజేతగా నిలిచాక.. ఆర్సీబీ చేపట్టిన విజయోత్సవ వేడుకలు విషాదంగా మారాయి. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విక్రయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలు ఆర్సీబీ యాజమాన్యం అయిన డియాజియో కంపెనీ ఖండించింది. ఆర్సీబీని అమ్ముతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఆ వార్తలన్నీ ఊహాజనితాలే అని స్పష్టం చేసింది. ఆర్సీబీ అమ్మకానికి చర్చలు కూడా జరగలేదని పేర్కొంది. ఈ మేరకు కంపెనీ కార్యదర్శి మిట్టల్ సంఘ్వీ.. భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటింగ్ బాడీకి లేఖ రాశారు. డియాజియో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రిజిస్టర్ అయి ఉంది. అమ్మకం వార్తల తర్వాత స్టాక్ మార్కెట్‌లో డియాజియో యాజమాన్యంలోని యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు భారీగా పెరిగాయి. అయితే ఆర్సీబీ టైటిల్ గెలిచాక.. డియాజియో ఫ్రాంఛైజీని అమ్మేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఫ్రాంఛైజీ ధరను సుమారు రూ.17,000 కోట్లుగా నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ ఆర్సీబీ యాజమాన్యం కొట్టిపారేసింది.