Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

సీఎం ‘డైవర్షన్’ డ్రామాలకు భయపడేదే లేదు

రాజకీయ వేధింపులే ధ్యేయంగా సాగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్‌ ‘డైవర్షన్’ డ్రామాలకు మేము భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పినా, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ‘ఓటుకు నోటు’ కేసులో డబ్బుల కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నేరచరిత్ర రేవంత్ రెడ్డిదని, ఇప్పుడు ఆ బురదనే అందరికీ అంటించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా సింగరేణిలో భారీ టెండర్ల రిగ్గింగ్ జరుగుతోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సుమారు తొమ్మిది టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబమే నియంత్రిస్తోందని, ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ పేరుతో కంపెనీలను బెదిరిస్తూ అక్రమ దందా సాగిస్తున్నారని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణాన్ని తాము సాక్ష్యాధారాలతో బయటపెట్టినందుకే, ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీశ్ రావును టార్గెట్ చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దోపిడీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనం వెనుక మర్మమేంటని, ఇందులో బీజేపీకి కూడా వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

అమృత్ టెండర్లు, రేషన్ బియ్యం స్కాం మరియు మూసీ ప్రాజెక్టు వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం నోటీసుల రాజకీయం చేస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీసులు బలి కావద్దని, అక్రమ కేసులు పెడుతున్న అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మరో రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని , అప్పుడు ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎనిమిది మంది మంత్రులను ధైర్యంగా ఎదుర్కొన్న హరీశ్ రావుకు, ఈ పోలీస్ విచారణలు ఒక లెక్క కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.