OTTలో సినిమా చూడాలంటే ఇక 8 వారాలు ఆగాల్సిందే..
కరోనా తరువాత సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం మనకు తెలిసినదే. పైగా ఓటీటీల పుణ్యమా అని వచ్చే కొద్దిమంది ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడంలేదు. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో నష్టభయాన్ని తట్టుకోలేక, గత కొద్దికాలంగా కొత్త సినిమాల షూటింగ్‌లు ఆపేయాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమల నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. మూడు వారాల తర్జనభర్జనల అనంతరం OTTలలో సినిమాలు విడుదల చేసే విషయంలో నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి వచ్చామని, సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక నుండి విడుదల అయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాత మాత్రమే ఓటిటిలో రావాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్లు తెలిపారు. ఇకముందు 50 లేదా 60 రోజుల తర్వాత మాత్రమే సినిమాలు ఓటీటీలో వస్తాయని, థియేటర్, మల్టీప్లెక్స్‌లలో కూడా టికెట్ ధరలు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీపీఎఫ్ ఛార్జీలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, శుక్రవారం జరిగే ఎగ్జిబిటర్స్ సమావేశంలో తుది నిర్ణయం జరగవచ్చని తెలియజేసారు. ఇక మనం కొత్త సినిమాలు టీవీలో చూడాలంటే 8 వారాలు ఆగాల్సిందే..


 
							 
							