‘నాకు వహ్ తాజ్ అలా ఉపయోగపడింది’..జాకిర్ హుస్సేన్
ప్రపంచ ప్రసిద్ది చెందిన తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వ్యాప్తి లేని ఆ కాలంలో ఆయన దేశవ్యాప్తంగా సామాన్య ప్రేక్షకులకు చేరువ కావడానికి కారణం మాత్రం తాజ్ మహల్ టీ యాడ్. దీని వెనుక స్టోరీ గురించి ఆసక్తికరమైన స్టోరీని ఒక ఇంటర్యూలో పంచుకున్నారు జాకిర్ హుస్సేన్. 1990లో ఆయన నటించిన బ్రూక్‌బాండ్ తాజ్ మహల్ టీ యాడ్ ద్వారా ఆయన సంగీత ప్రియులకు దగ్గరయ్యారు. ఆయన తబలపై వాయించలేని రాగం లేదంటే అతిశయోక్తి లేదు. ఆయన తబలా ప్రదర్శన పూర్తయ్యాక ప్రేక్షకులు ‘వాహ్ ఉస్తాద్’ అంటూ మెచ్చుకునేవారు. దీనిని ఆధారంగా తీసుకుని హిందుస్థాన్ థాంప్సన్ అసోసియేట్స్ కంపెనీ ఈ బ్రూక్‌బాండ్ తాజ్ మహల్ టీ యాడ్ రూపొందించింది. ఈ యాడ్‌లో ఆయన ఆగ్రాలోని ప్రపంచప్రసిద్ధ తాజ్ మహల్ ముందు కూర్చుని తబలా వాయిస్తుంటారు. తనను ఉత్తమంగా తీర్చుకునేందుకు మ్యాస్ట్రో సాధన చేస్తుంటారు. అలాగే తాజ్ మహల్ టీ కూడా అనేక నాణ్యతా పరీక్షలు ఎదుర్కోని గెలిచిందని బ్యాక్ గ్రౌండ్‌లో ఈ యాడ్‌ను పూర్తి చేస్తారు. ఈ యాడ్‌లో తనను మెచ్చుకున్న బాలుడు ‘వాహ్ ఉస్తాద్’ అంటే ఆయన ‘అరె హుజూర్ వాహ్ తాజ్ అనండి’ అంటారు. దీనితో ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. ఈ యాడ్ గురించి ఆయన మాట్లాడుతూ ‘నా పేరు వినగానే వాహ్ తాజ్ అంటారు. సినిమా మ్యూజిక్‌తో పోలిస్తే, శాస్త్రీయ కళాకారులకు ఆదరణ తక్కువే. ప్రజలకు చేరువయ్యేందుకు మాలాంటి వారికి వేదిక కావాలి. తాజ్ టీ నాకు అలాగే పేరు తెచ్చింది. నన్ను తాజ్ ద్వారా చాలామంది గుర్తుపట్టేలా చేసింది’ అంటూ పేర్కొన్నారు.