పులివెందులలో ఓటర్ల నిరసన
పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తుంటే కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఓటర్లు మండిపడుతున్నారు. రౌడీలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు కొందరు ఓట్లు వేస్తూ,అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారికి సహకరిస్తున్నారని, అయితే తాము ఓటు హక్కును కోల్పోయేందుకు సిద్ధంగా లేమని, తమ ఓటును వినియోగించుకుంటామంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు. పులివెందుల మండలం కనంపల్లిలో గ్రామస్తులను పోలీసులు అడ్డున్నారు. అయితే తమను ఓటు వేయనివ్వండంటూ వాళ్లు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు. మా ఓట్లు మమ్మల్ని వేసుకోనివ్వండి అంటూ అభ్యర్థించినా, పోలీసులు కనికరించలేదు. ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని.. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు. మరోవైపు.. తమనూ ఓటేయకుండా అడ్డుకుంటున్నారంటూ పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేయడానికి వెళ్తే ఇక అంతే సంగతులు అంటూ బెదిరించారు అంటూ కొందరు వాపోయారు. ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని.. వందల మంది స్థానికేతర రౌడీలు తమ ఓట్లను వేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.