విజయశాంతికి కూడా ఛాన్స్ లేదట..
తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోయాయి. తాము సీనియర్లు అయినా తమకు ఈ కమిటీలో ఛాన్స్ దొరకలేదని బాధపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా కమిటీల గురించి మాట్లాడారు. తాజాగా విజయశాంతి కూడా ఈ లిస్టులో చేరారు. సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయి అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, తనకు కమిటీలో ఛాన్స్ లేదనే బాధ ఎక్కువగా ఉంది. మొన్నటి కమిటీలో నా పేరు లేదంటే మరో కమిటీలో వస్తుందేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను కూడా కమిటీలో ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 15 మందితో అడ్వైజరీ కమిటీ, 7గురితో పీసీసీ క్రమశిక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, మల్లు రవి, మధు యూష్కీ వంటివారు ఉన్నారు.

