అతి భారీ వర్షం.. ఢిల్లీ అతలాకుతలం
దేశ రాజధాని ఢిల్లీని గాలివాన ముంచెత్తింది. ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురు గాలులు, భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా ద్వారకలో ఓ వ్యవసాయ భూమిలో నిర్మించిన ట్యూబ్వెల్ గదిపై భారీ వృక్షం కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త అజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గాలివాన బీభత్సంతో దాదాపు 120 విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీలోని విమానాశ్రయానికి చేరుకునే మూడు విమానాలను అహ్మదాబాద్, జైపూర్ లకు మళ్లించారు. ఢిల్లీ నుంచి బయల్దేరే 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.