ముగిసిన డీఎస్సీ క్రీడా కోటా ధ్రువపత్రాల పరిశీలన
ఏపీలో మెగా డీఎస్సీకి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన విజయవాడ లోని ఇందిరా గాంధీ నగరపాలక సంస్థ (ఐజీఎంసీ) స్టేడియంలో ముగిసింది. ఈ ప్రక్రియ శని, ఆదివారాల్లో సాగింది. 421 పోస్టులకు గాను 1,221 మంది అభ్యర్థులను పిలవగా 1,172 మంది హాజరయ్యారని శాప్ పరిపాలనాధికారి ఆర్.వెంకట రమణ నాయక్ తెలిపారు. మరో రెండు రోజుల్లో టెంటేటివ్ జాబితాను ఆన్ లైన్ లో పెడతామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.