Telangana

గుర్రంపై వచ్చి నామినేషన్ వేసిన వీరభోగ వసంత రాయలు

మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి కొందరు మందీమార్బలంతో వస్తే.. మరికొందరు.. ఇదిగో ఇలా వినూత్నంగా వచ్చి ఆకట్టుకున్నారు. చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కుమ్మరిగూడెంకు చెందిన డాక్టర్‌ వీరభోగ వసంతరాయుడు గుర్రం మీద వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇతను వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ ఓట్లు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వకపోవటం బాధాకరమని, రెండు తెలుగు రాష్ట్రాలలో కుమ్మరి కులానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో, తమ కులస్తులను ప్రభుత్వాలు గుర్తించాలన్న ఉద్దేశంతో గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రిగా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు