ఇంగ్లండ్ లో వైభవ్ సూర్యవంశీ క్రేజ్..
ఐపీఎల్ లో అదరగొట్టిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి క్రేజ్ మామూలుగా లేదు. అతనికి భారత్ లోనే కాకుండా.. ఇంగ్లాండ్ లో కూడా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం యూత్ జట్టు తరపున ఇంగ్లాండ్ లోనే ఉన్న వైభవ్ ను కలిసేందుకు ఇద్దరు అభిమానులు దాదాపు 6 గంటలపాటు ప్రయాణించి మరీ వచ్చారు. వైభవ్ తో ఫొటో దిగాలని.. అందుకోసం చాలా కష్టపడి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఫ్యాన్స్ స్టోరీని రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
“వీరిద్దరూ బెస్ట్ ఫ్యాన్స్ అనేందుకు ఇంకేం ఆధారాలు కావాలి. అనన్య, రివా ఇద్దరూ ఆరు గంటలపాటు ప్రయాణించి వోర్సెస్టర్ కు వచ్చారు. పింక్ జెర్సీలను ధరించి వచ్చిన వారికి వైభవ్ సూర్యవంశీ ఫొటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇది వారిద్దరికీ గుర్తుండిపోయే రోజు” అని రాజస్థాన్ పోస్టు చేసింది. భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు తనకు గిల్ స్ఫూర్తిగా నిలుస్తాడని.. ఈసారి ఎలాగైనా డబుల్ సెంచరీ కొట్టేందుకు ప్రయత్నిస్తానని ఇటీవల ఇంగ్లాండ్ తో నాలుగో వన్డే అనంతరం వైభవ్ వెల్లడించాడు. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో సెంచరీ కొట్టిన బ్యాటర్ గా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో వన్డే సిరీస్ లో నాలుగో మ్యాచ్ లో అతను 52 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకున్నాడు. యూత్ వన్డేల్లో పాకిస్థాన్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ (53 బంతుల్లో, 2013లో) దే ఇప్పటివరకు వేగవంతమైన శతకం ఈ రికార్డును అధిగమించాడు వైభవ్. అండర్-19లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ శాంటో (14 ఏళ్ల 241 రోజులు) పేరిట ఉన్న కార్డును సైతం వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ సెంచరీ కొట్టిన సమయానికి వైభవ్ వయసు 14 ఏళ్ల 100 రోజులే.