ఉక్రెయిన్ కు అమెరికా 3బిలియన్ డాలర్ల భారీసాయం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఆరునెలలు గడిచిపోతోంది. ఉక్రెయిన్ వెనుక అమెరికా హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఉక్రెయిన్‌కు భవిష్యత్ అవసరాల కోసం కొత్త ప్యాకేజీలు ఇవ్వడానికి యునైటెడ్ స్టేట్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్తనిధులు మునుపటి ప్యాకేజీల వలే కాకుండా మధ్యస్థ, దీర్ఘకాలిక రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాట్లు చేయబడ్డాయి. రానున్న రోజుల్లో ఉక్రేనియన్ దళాలకు శిక్షణ ఇవ్వడానికి, సన్నద్ధం చేయడానికి జో బిడెన్ ప్రభుత్వం అదనంగా సుమారు 3 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉందని యూఎస్ అధికారులు తెలియజేసారు.

ఈ ప్యాకేజీలో మూడురకాల డ్రోన్‌లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పరికరాల కోసం కాంట్రాక్టులకు నిధులు సమకూరుస్తుందని పేర్కొన్నారు. ఇంతేకాక చిన్ని, చేతితో లాంచ్ చేయబడిన ప్యూమాడ్రోన్‌లు, కాటాపుల్ట్ ద్వారా ప్రయోగించబడే దీర్ఘకాలిక స్కాన్ ఈగిల్ నిఘా డ్రోన్‌లు, మొదటిసారిగా, ఓడల నుంచి ప్రయోగించగలిగే బ్రిటిష్ వాంపైర్ డ్రోన్ సిస్టమ్‌కు కావలసిన ధన సహాయం కూడా ఉక్రెయిన్‌కు అందజేస్తోంది అమెరికా. భవిష్యత్తులో మరింతమంది అమెరికన్ సైనిక దళాలను ఐరోపాలో ఉంచే అవకాశం ఉందని యుఎస్ అధికారులు తెలిపారు.