సిరియాపై అమెరికా వైమానిక దాడి
సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా భారీ వైమానిక దాడులకు తెగబడింది. ‘ఆపరేషన్ హాకీ స్ట్రైక్’లో భాగంగా అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) దళాలు మిత్రరాజ్యాల సాయంతో సిరియాలోని విస్తరించి ఉన్న ఐసీస్ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 30 కు పైగా ఐసీస్ స్థావరాలు పూర్తిగా నేలమట్టం చేసినట్లు అమెరికా తెలిపింది. సిరియాలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు దాడులు ప్రారంభమైనట్లు సెంట్కామ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలిపింది. ఈ దాడుల్లో 90కు పైగా ప్రెసిషన్ ఆయుధాలను ఉపయోగించగా, 35కుపైగా ఐసీస్ లక్ష్యాలను ఛేదించినట్లు సమాచారం. రెండు డజన్లకు పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
‘‘యూఎస్ దళాలు, మిత్రదేశాల భద్రతకు ముప్పుగా మారే ఎవరినైనా, వారు ఎక్కడ ఉన్నా గుర్తించి నిర్మూలిస్తాం’’ అంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అమెరికా నిరంతర నిబద్ధతకు ఈ ఆపరేషన్ నిదర్శనమని స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు గత నెల 19న ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు యూఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు , గత నెల 13న సిరియాలోని పాల్మిరా ప్రాంతంలో జరిగిన ఐసీస్ దాడిలో ఇద్దరు యూఎస్ సైనికులు, ఒక అమెరికన్ పౌరుడు మృతి చెందడం ఈ చర్యకు కారణమైంది. మృతులను ఐయోవా నేషనల్ గార్డ్‌కు చెందిన సార్జెంట్ ఎడ్గార్ బ్రియాన్ టోర్రెస్ టోవర్, సార్జెంట్ విలియం నాథనియల్ హోవార్డ్‌గా గుర్తించారు.

