Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTelanganaviral

సీఎం చేతకానితనం వల్లే యూరియా సంక్షోభం

యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు యూరియా అందుబాటులో లేక పంటలు ఎండిపోతున్న సమయంలో, రైతులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన చేతకానితనంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు ఆ కోపాన్ని రైతులపై చూపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్, రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకే ఈ ప్రాథమిక హక్కులు తెలియకపోవడం విచారకరమని విమర్శించారు. యూరియా దొరకక పంటలు ఎండిపోతున్నాయని బాధతో గళమెత్తిన ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్‌పై అర్థరాత్రి పోలీసులు దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం, కేసులు బనాయించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యంలో అన్నదాతలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించిన ఆయన, రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు ఇచ్చే రాహుల్ గాంధీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “రైతులందరినీ అరెస్టు చేయడానికి ఈ ప్రభుత్వానికి పోలీసులు సరిపోవు, రాష్ట్రంలోని రైళ్లు కూడా సరిపోవు” అని కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

రైతులను ఇలాగే వేధించడం కొనసాగిస్తే, వారందరికీ బీఆర్ఎస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రైతులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, ఇకనైనా ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు మానుకోవాలని స్పష్టం చేశారు.