Home Page SliderTelangana

భారత్, న్యూజిలాండే మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం సర్వసన్నద్ధం.

ఈరోజు(బుధవారం) భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ తొలి మ్యాచ్, హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతోంది. ఈసందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు రాచకొండ పోలీసులు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాచకొండ కమీషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. భద్రతా ఏర్పాట్లను వెల్లడించారు.

ఆ వివరాల ప్రకారం 2,500 పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. 250 మందితో సెక్యూరిటీ, 400 మంది ట్రాఫిక్, 1100 మంది లా అండ్ ఆర్డర్, TSSP సిబ్బంది, ఆర్మీ సిబ్బంది, ఆక్టోపస్ టీం కూడా భద్రతా దళాలలో ఉన్నారు. ఇంకా ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు, 300లకు పైగా సీసీ కెమెరాలు, పర్యవేక్షిస్తూ ఉంటాయి. కంట్రోల్ రూమ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో నిరంతర గస్తీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు షీటీం లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

వీఐపీలకు మాత్రమే గేట్ నెంబర్ 1 నుండి అనుమతి ఉంటుందని, జనరల్ పబ్లిక్‌కు గేట్ నెంబరు 12 ను కేటాయించినట్లు తెలిపారు. సెల్‌ఫోన్ తప్ప ఇతర వస్తువులను స్టేడియంలోకి అనుమతించరు. మంచినీరు, స్నాక్స్ అన్నీ అక్కడే కొనుగోలు చేయవలసి ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షలను బుధవారం ఉదయం నుండే అమలు చేస్తున్నారు. భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మ్యాచ్ చూడడానికి వచ్చేవారి వాహనాలను కూడా నిర్థేశించిన స్థలంలోనే పార్కింగ్ చేయవలసి ఉంటుంది. హైదరాబాద్ మెట్రో  కూడా ఉప్పల్ స్టేడియంకు అదనంగా మెట్రో ట్రైన్లను ఏర్పాటు చేసింది.