InternationalNewsNews Alert

భూమి పోలికలతో నీటి గ్రహం- టాయ్-145బి

మానవులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సాధించినప్పటి నుండీ అంతరిక్షం వైపు దృష్టి సారించారు. ఈ విశాల విశ్వంలో కేవలం భూమి మీద మాత్రమే ప్రాణులు ఉన్నారా.. మనం ఒంటరి వారమా..  ఇంకా భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయా.. అనే అన్వేషణ మొదలు పెట్టారు. ఈ అన్వేషణలో భాగంగానే  సౌరకుటుంబంలో మిగిలిన గ్రహాలపైకి ప్రయాణం మొదలుపెట్టారు. అలాంటి అద్భుతాలను తెలుసుకునే మానవప్రయత్నం వృథా కాలేదనే చెప్పాలి. ఈ విశ్వంలోని అనేక గ్రహాలను కనిపెట్టారు. దీనిలో కొన్ని ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మాంట్రిల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు మన భూమికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్రాగన్ నక్షత్ర కూటమిలోని బైనరీ వ్యవస్థలో సరిగ్గా భూమి లాంటి ఓ గ్రహాన్ని కనిపెట్టారు. ఇది భూమి కంటే సుమారు 70 శాతం పెద్దదని, ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లు ఉన్నాయని నిర్థారణకు వచ్చారు. దీనికి టాయ్- 145బి అని పేరు పెట్టారు. కెనడాలోని మాంట్-మెగాంటిక్ అబ్జర్వేటరీలో.. అత్యంత ఖచ్చితమైన కొలతల కోసం రూపొందించిన స్పిరౌ అనే పరికరం ద్వారా ఈ గ్రహాన్ని కనిపెట్టినట్లు అస్ట్రోనామికల్ జర్నల్ తెలిపింది.

ఈ మధ్య వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా “INTERSTRELLAR” లో రకరకాల గ్రహాలను వెదకుతూ వ్యోమగాములు వెళుతూ ఉంటారు. వారికి ఇలాంటి సముద్రగ్రహమే ఒకటి కనిపిస్తుంది. అచ్చం ఆ కథలో ఉన్నట్లే మొత్తం నీటితో కూడిన గ్రహమే ఇక్కడ కూడా శాస్త్రవేత్తలకు దొరికింది. ఇది చిన్నబుల్లి నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, వాటిమధ్య దూరం ఎక్కువగా ఉండడం వల్ల నీళ్లు చాలా చల్లగా  ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ఈ పరిశోధనలు సాగించిన ఛార్లెస్ కాడియక్స్ బృందం.