Home Page SliderInternationalNews AlertSports

అదరగొట్టిన అండర్ -19 చిచ్చర పిడుగులు..50 ఓవర్లలో 444 పరుగులు..

లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమ్ ఇండియాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో పోరులో శుభ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ టీమ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే . అయితే భారత్ అండర్ -19 టీమ్ మాత్రం తన సత్తా చాటింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న యువ జట్టు లాఫ్ బరోలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ యంగ్ లయన్స్ ను 231 పరుగుల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో భారత యువ జట్టు కేవలం 50 ఓవర్లలోనే 444 పరుగులు చేసి అసలైన బజ్ బాల్ క్రికెట్ ను ఇంగ్లాండ్ యూత్ టీమ్ కు రుచి చూపించింది. ఐపీఎల్ (IPL) 2025లో చెన్నైసూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడిన ముంబయికి చెందిన యువ బ్యాట్స్ మన్ ఆయుష్ మాత్రే (Ayush Mhatre).. భారత యువ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే అతడు ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. కేవలం 1 పరుగుకే అవుటయ్యాడు. ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సైతం కేవలం 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. కానీ ఈ మ్యాచ్లో 18 ఏళ్ల హర్వంశ్ పంగాలియా (Harvansh Pangalia) తన సత్తా చాటాడు. కేవలం 52 బంతుల్లో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో మొత్తం 8 ఫోర్లు, 9 సిక్స్ లు బాదాడు. అతడికి రాహుల్ కుమార్ తగిన సహకారం అందించాడు. 60 బంతుల్లో 73 పరుగులు చేశాడు. కనిష్క చౌహాన్ 67 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అలాగే అంబ్రిష్ కేవలం 47 బంతుల్లోనే 72 రన్స్ రాబట్టాడు. ఈ మ్యాచ్ లో సెంచరీతో సత్తా చాటిన వికెట్ కీపర్ బ్యాటర్ హర్వంశ్ స్వస్థలం గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ లోని గాంధీధామ్ అనే చిన్న పట్టణం. కానీ వీరి కుటుంబం ప్రస్తుతం కెనడాలో స్థిరపడింది.